
గతేడాది నుంచి టీమిండియాలో భారీ మార్పులే జరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ
ఈ క్రమంలో మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాకిస్తూ పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌తో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌గా సూర్యకు పగ్గాలు అప్పగించగా.. అతడు ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.
ఇక టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్ శర్మకు వన్డేల్లో మోదం, టెస్టుల్లో ఖేదం అన్నట్లుగా పరిస్థితి మారింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో పాటు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది.
టెస్టు రిటైర్మెంట్ ప్రకటన
ఈ రెండు సిరీస్‌లలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌లోనూ టెస్టులకు సారథిగా అతడే ఉంటాడని ముందుగా బీసీసీఐ లీకులిచ్చినా.. అనూహ్యంగా రోహిత్ నుంచి టెస్టు రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. అయితే, వన్డేల్లో మాత్రం తాను కొనసాగుతానని రోహిత్ శర్మ చెప్పగా.. బీసీసీఐ కూడా తమ వన్డే కెప్టెన్ అంటూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
టీమిండియా టెస్టు సారథిగా గిల్
ఇక రోహిత్ శర్మ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. వీరిద్దరి కంటే ముందే.. అంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కూడా వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ప్రస్తుత టీమిండియాలో రవీంద్ర జడేజా సీనియర్‌గా ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు.
అయితే, పనిభారాన్ని తగ్గించే నిమిత్తం బుమ్రా నిర్ణయానుసారమే అతడి పేరును బోర్డు కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ టీమిండియా టెస్టు సారథిగా ఎంపికయ్యాడు.
చారిత్రాత్మక విజయంతో..
ఇక కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీ బాది రికార్డులు సృష్టించిన గిల్.. తొలి ప్రయత్నంలో గెలుపును మాత్రం అందుకోలేకపోయాడు. అయితేనేం.. రెండో టెస్టులోనే చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)తో చెలరేగి.. ఈ వేదికపై తొలిసారి భారత్‌కు గెలుపు అందించాడు.
తదుపరి వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా గిల్!
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రెవ్‌స్పోర్ట్స్ జర్నలిస్టు ఒకరు.. ‘‘తదుపరి వన్డే సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడు’’ అని ట్వీట్ చేశారు. దీంతో రోహిత్ శర్మను తప్పించి గిల్‌కు వన్డే పగ్గాలు కూడా అప్పగిస్తారా? అనే చర్చ నడుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2027లో జరుగనున్న విషయం తెలిసిందే.
అప్పటికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు వస్తాయి గనుక.. అతడు ఆడకపోవచ్చని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌తో పాటు.. కోహ్లి కూడా వరల్డ్‌కప్ టోర్నీ కంటే ముందే వన్డేలకూ గుడ్‌బై చెబుతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు ఇప్పటికే టీమిండియాకు ఎనలేని సేవ చేశారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు.
ఇకపై ఐపీఎల్‌లో మాత్రమే రో-కో కొనసాగితే చాలని అంటున్నారు. కాగా టెస్టు రిటైర్మెంట్ తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం సెప్టెంబరులో జరగాల్సిన ఈ సిరీస్‌ను వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబరులో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లి పునరాగమనం చేయనున్నారు. ఇంతలోనే రోహిత్ నుంచి పగ్గాలు గిల్ చేపట్టబోతున్నాడనే వదంతి సోషల్ మీడియాలో వ్యాపిస్తోంది.
చదవండి: కావాలనే క్వాడ్రపుల్ సెంచరీ (400) మిస్.. లారా రియాక్షన్ ఇదే
7th May ko kaha tha. Baar baar mat poocho bhai log. #RohitSharma #ShubmanGill https://t.co/PWcHEyJHbr
— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025
Whenever India's next odi series will be - Gill will lead
— Rohit Juglan (@rohitjuglan) July 10, 2025