breaking news
Indian team captain
-
గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్‌తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్‌దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్‌హామ్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్‌బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్‌కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్‌కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్‌ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్‌కు 4.6 రన్‌రేట్‌తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్‌ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్‌దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్‌ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్‌దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0. -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్‌లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
ఐదారేళ్లు వెనుకబడి ఉన్నాం
2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్, 2018 టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్, 2020 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్... వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళల క్రికెట్ జట్టు నాకౌట్ దశకు చేరినా టైటిల్ మాత్రం దక్కలేదు. అప్పటి వరకు బాగా ఆడుతూ వచ్చిన మన అమ్మాయిలు కీలక దశలో చేతులెత్తేశారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నట్లు కనిపించినా... ఓవరాల్‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లాంటి మేటి జట్ల స్థాయికి మనం ఇంకా చేరుకోలేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. రాబోయే రోజుల్లో ఈ అంతరం తగ్గాల్సిన ఆవశ్యకత ఉందని భారత టి20 టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెబుతోంది. ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్‌నకు మరో ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో ఈ టోర్నీ జరగనుంది. గత మూడు ఐసీసీ టోర్నీల ఫలితాలను చూసుకుంటే వచ్చే మెగా టోర్నీలోగా పలు లోపాలను మనం సరిదిద్దుకోవాల్సి ఉందని టీమ్ అగ్రశ్రేణి బ్యాటర్, టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (వన్డే టీమ్‌కు మిథాలీ రాజే కెప్టెన్) అభిప్రాయపడింది. ఇందులో ఫీల్డింగ్, ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడంతో పాటు పేసర్లను తీర్చిదిద్దడం కూడా కీలకమని ఆమె చెబుతోంది. వివిధ అంశాలపై హర్మన్ అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... భారత జట్టు ఫిట్‌నెస్‌పై... దురదృష్టవశాత్తూ మనం ఇలాంటి అంశాలు చాలా ఆలస్యంగా మొదలు పెడతాం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్ల విషయంలో ఫిట్నెస్ వారి సంస్కృతిలో ఒక భాగంలా ఉంది. ఇతర జట్లతో పోలిస్తే ప్రతిభపరంగా బ్యాటింగ్, బౌలింగ్‌లలో కూడా మన జట్టు ఎంతో మెరుగ్గా ఉంది. కానీ ఫిట్నెస్ మాత్రమే మమ్మల్ని వెనక్కి లాగుతోంది. ఇప్పుడు మన అమ్మాయిల్లో అందరిలోనూ దీనిపై శ్రద్ధ పెరిగింది కాబట్టి శ్రమిస్తున్నారు. వారికి కూడా తమ బాధ్యత అర్థమైంది. ఒక్క రోజులో ఇదంతా మారిపోదు. సుదీర్ఘ సమయం పాటు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మన దేశవాళీ క్రికెట్‌పై... ఇది మరో పెద్ద లోపం. సరిగ్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకంటే మనం ఈ విషయంలో కనీసం ఐదారేళ్లు వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు కొంత మారుతున్నా.... కొన్నాళ్ల క్రితం వరకు కూడా దేశవాళీ క్రికెట్లో ఇస్తున్న ప్రదర్శనకు, అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి వారు ఆడుతున్న తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఇటీవల బీసీసీఐ 30 మంది మహిళా క్రికెటర్లకు ప్రత్యేక షెడ్యూల్ తయారు చేసి ఇస్తుండటంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనను బట్టి జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తే వారు తడబాటుకు గురి కావడం కొంత తగ్గింది. తమ నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆశిస్తోందో వారికి అర్థమవుతోంది. నిజాయితీగా చెప్పాలంటే దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఎలా ఉండాలో అలా మాత్రం ఇప్పటికీ లేదు. అందుకే ఐదారేళ్లు వెనుకబడిన పోలిక తెస్తున్నాను. దేశవాళీ స్థాయి పెరిగితేనే అంతర్జాతీయ స్థాయిలో కూడా బాగా ఆడగలరని నా అభిప్రాయం. పేస్ బౌలింగ్ బలహీనతలపై... ఒకటి, రెండేళ్ల క్రితం పేస్ బౌలర్లను తీర్చిదిద్దడంపై మనం దృష్టి పెట్టి ఉంటే ఇంతగా స్పిన్నర్లను నమ్ముకునే అవసరం రాకపోయేది (ప్రపంచకప్‌లో ఒకే ఒక పేసర్ శిఖా పాండే అన్ని మ్యాచ్‌లు ఆడగా, అరుంధతి రెడ్డి రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగింది). జట్టు అవసరాలను బట్టి చూస్తే మనకు కనీసం ముగ్గురు పేస్ బౌలర్ల అవసరం ఉంది. అయితే వారిలో ఏమాత్రం సత్తా ఉందనేది కూడా చూడాలి. ఈ విభాగంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బౌలర్లను దాటి బయట సరైన ప్రతిభను అన్వేషించాలి. వచ్చే రెండేళ్లలో నాణ్యమైన పేసర్లు మనకు లభిస్తారని నమ్ముతున్నా. స్వీయ బ్యాటింగ్ వైఫల్యాలు, కెప్టెన్సీపై... టి20 జట్టు కెప్టెన్సీ నాకు భారం కాదు. నా బ్యాటింగ్‌పై దాని ప్రభావం ఉందంటే అంగీకరించను (ప్రపంచకప్‌లో 5 ఇన్నింగ్స్‌లలో కలిపి 30 పరుగులే చేసిన హర్మన్ టి20ల్లో ఆఖరిసారిగా 16 నెలల క్రితం అర్ధ సెంచరీ నమోదు చేసింది. ఫిబ్రవరి 2018 తర్వాత ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ చేయలేదు). బయటినుంచి చూస్తే నేను విఫలమైనట్లు కనిపించవచ్చు కానీ నాకు అలాంటి భావన ఏమీ లేదు. నా బ్యాటింగ్‌పై నాకు విశ్వాసం ఉంది. గణాంకాలు వాటిని సరిగా విశ్లేషించలేవు. వీటి వల్ల నా నైతిక స్థయిర్యం దెబ్బతినదు. కెప్టెన్సీని నేను బాగా ఆస్వాదిస్తున్నాను. అన్ని విషయాల్లో భాగమవుతూ చురుగ్గా నా బాధ్యతలు నెరవేరుస్తున్నా. గతంలో నా బ్యాటింగ్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. సారథ్యం కారణంగా వ్యక్తిగతంగానూ నాలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఇప్పుడు నా గురించి మాత్రమే కాకుండా ఇతర అన్ని అంశాల గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత నాపై ఉంది. స్పిన్‌పై అతిగా ఆధారపడటంపై... ఇటీవల టి20 ప్రపంచకప్‌లో స్పిన్‌ను అనుకూలంగా లేని పిచ్‌లపై కూడా వారినే నమ్ముకున్నాం. క్రికెట్ వ్యూహాలపరంగా చెప్పాల్సి వస్తే అది ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. అయితే అలాంటి పెద్ద టోర్నీలో ఒక జట్టుకు తమ బలాలు, బలహీనతల గురించి తెలిసి ఉండటం, బలాన్ని సమర్థంగా వాడుకోవడం కూడా కీలకం. ప్రస్తుత స్థితిలో స్పిన్నర్లు మా జట్టు బలం. అందుకే తప్పడం లేదు. -
కోహ్లి స్టయిలే వేరు!
పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు తీసుకున్న వెంటనే కోహ్లి తన తొలి అడుగులోనే దూకుడు చూపించాడు. కెప్టెన్‌గా తన మొదటి నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. ఉపఖండంలో ముగ్గురు పేసర్లతో సహా ఐదుగురు బౌలర్లతో తుది జట్టును ఎంపిక చేశాడు. దీనికోసం టెస్టు జట్టుకు వెన్నెముకలాంటి పుజారాను పెవిలియన్‌లో కూర్చోబెట్టాడు. ఇది తన ‘ముద్ర’ను చూపించే ప్రయత్నమా? లేక సేఫ్‌గా ఆడిన గేమా? సాక్షి క్రీడా విభాగం : ఆటలో ఆ ఇద్దరివీ భిన్న ధ్రువాలు... ఒకరికి దూకుడు అలవాటైతే మరొకరి ఆట నిండు కుండలా ప్రశాంతం. ఒక టెస్టు మ్యాచ్‌లో వీరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే కెప్టెన్ ఏం చేయాలి? రిస్క్ ఉన్నా ‘కొత్తదనం’ గురించి ఆలోచించాలా? లేక సంప్రదాయానికి పట్టం కట్టాలా? బంగ్లాదేశ్‌తో టెస్టుకు ముందు కోహ్లికి ఎదురైన పరిస్థితి ఇది. ఈ విషయంలో తను ఎలాంటి మొహమాటాలకు పోలేదు. ఐదో బౌలర్ కోసం చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు టెస్టు స్పెషలిస్ట్ అని చూడకుండా పుజారాను పెవిలియన్‌కు పరిమితం చేశాడు. తాను నాయకత్వం వహించిన సిడ్నీ టెస్టులాగే మూడో స్థానాన్ని రోహిత్‌కు అప్పగించాడు. ఇది కోహ్లి తనదైన కొత్త శైలి చూపించే ప్రయత్నమా? లేక రోహిత్‌ను తప్పిస్తే వచ్చే విమర్శలనుంచి తప్పించుకోవడమా? కోహ్లి మనసులో ఏముందో... ఆస్ట్రేలియాలాంటి చోట కూడా భారత జట్టు ఎప్పుడూ ఐదుగురు బౌలర్లతో ఆడలేదు. ధోని జమానాలో అయితే అసలు దాని గురించి పెద్దగా చర్చించే అవసరం కూడా రాలేదు. సిడ్నీ టెస్టులో కెప్టెన్‌గా నలుగురు బౌలర్లనే ఆడించిన కోహ్లి బంగ్లాదేశ్ రాగానే ఒక్కసారిగా దూకుడు పెంచాలని భావించాడు. ఉపఖండంలో భారత్ ముగ్గురు పేసర్లతో ఆడటం కూడా చాలా అరుదైన విషయం. ఈ స్థితిలో కచ్చితంగా ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓపెనర్‌గా విజయ్, ధావన్‌ల రికార్డు ప్రకారం వారిని పక్కన పెట్టడం కష్టం. తాను, రహానే, కీపర్ కచ్చితంగా ఉండాలి కాబట్టి రోహిత్, పుజారాల మధ్య పోటీ నెలకొంది. అయితే ‘నేనొచ్చాశానోచ్’ అనే సందేశం ఇవ్వడానికో లేక నా శైలి భిన్నం అని చాటుకోవడానికో కోహ్లి ఐదుగురు బౌలర్ల సూత్రం పాటించాడు. నిజంగా బంగ్లాలాంటి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్లు అవసరమా అనేది సందేహం. పుజారా అవసరం లేదా? ద్రవిడ్ వారసుడిగా జట్టులోకి వచ్చిన పుజారా నికార్సయిన టెస్టు బ్యాట్స్‌మన్. గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోవడం, భీకరమైన కొత్త బంతి పని పట్టి తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ పని సులువు చేయడంలో అతను దిట్ట. అయితే ఇదంతా స్కోరు బోర్డులో కనిపించదు. 2014 ఆరంభంలో దక్షిణాఫ్రికా సిరీస్ మొదలు 20 ఇన్నింగ్స్‌లలో కలిపి పుజారా రెండు అర్ధ సెంచరీలతో 483 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 24.15 మాత్రమే. మూడో స్థానం ఆటగాడినుంచి ఆశించిన ప్రదర్శన మాత్రం ఇది కాదు. అయితే టెస్టు జట్టులో అలాంటి ఆటగాడి అవసరం కూడా ఉంటుంది. ఐపీఎల్ ఆడని పుజారా కౌంటీల్లో యార్క్ షైర్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లలో 264 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. కౌంటీల్లో ఆటంటే సరిగ్గా టెస్టు మ్యాచ్‌లకు అతికిపోయే దృక్పథం ఉంటుంది కాబట్టి అతను బంగ్లాతో మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లే. అయితే జట్టులో ప్రతీ బ్యాట్స్‌మన్ దూకుడు నేర్వాలని పదే పదే చెబుతున్న కోహ్లి... సంప్రదాయ శైలిలో ఆడే పుజారాలాంటి ఆటగాడి అవసరం ఈ టెస్టుకు లేదని భావించాడేమో. పైగా పుజారాను తప్పించినా అతనికి పెద్దగా మద్దతు లభించదు కాబట్టి ఇది సేఫ్గేమ్లాంటిదే. రోహిత్‌పైనే నమ్మకం రోహిత్ తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆసీస్‌తో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 53, 39 పరుగులు చేశాడు. తర్వాతి మ్యాచ్‌నుంచి ఒక ఆటగాడిని తప్పించేంత ఘోరమైన ప్రదర్శన ఏమీ కాదు ఇది. కాబట్టి అతను పూర్తిగా విఫలమై, మరో ఆటగాడు తనను తాను నిరూపించుకుంటే తప్ప రోహిత్‌ను తప్పించడం సరైంది కాదు. కాబట్టి సిడ్నీనుంచి ఆటోమెటిక్‌గా రోహిత్‌కు చోటు దక్కినట్లే. టెస్టుల్లో రోహిత్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. సొంతగడ్డపై తొలి రెండు టెస్టుల్లో సెంచరీల తర్వాత ఉపఖండం బయట 16 ఇన్నింగ్స్‌లలో అతని సగటు 24.93 మాత్రమే. ఎనిమిది టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలే చేశాడు. కానీ వన్డేల్లో ఓపెనర్‌గా మారిన తర్వాత వచ్చిన దూకుడు రోహిత్ బ్యాటింగ్‌లో అన్ని ఫార్మాట్లలో కనిపిస్తోంది. టెస్టులకు కూడా అది అవసరమని కెప్టెన్ భావించినట్లున్నాడు. చాలా సందర్భాల్లో కోహ్లి, రోహిత్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ వచ్చాడు. ఇటీవల ఐపీఎల్ ప్రదర్శన, నాయకత్వం రోహిత్‌ను ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. కొన్ని సందర్భాల్లో భవిష్యత్తు కెప్టెన్ అంటూ ప్రశంసలు కూడా మొదలయ్యాయి. ఈ స్థితిలో రోహిత్‌ను పక్కన పెడితే కోహ్లిపై అన్ని వైపులనుంచి విమర్శలు ఎదురయ్యేవి. పూర్తి స్థాయి కెప్టెన్‌గా అప్పుడే ఇలాంటి వాటిని ఎదుర్కోవడం విరాట్‌కూ ఇష్టం ఉండదు. శైలి భిన్నమే: స్యామీ ధోనితో పోలిస్తే కెప్టెన్సీ విషయంలో కోహ్లి శైలి భిన్నంగా ఉంటుందని వెస్టిండీస్ టి20 సారథి డారెన్ స్యామీ అభిప్రాయపడ్డాడు. ‘ధోని ఎక్కువగా మాట్లాడకుండా తాను చెప్పదలుచుకుంది కూల్‌గా చెప్తాడు. కానీ కోహ్లి ప్రతి అంశంలోనూ జోక్యం చెసుకోవడాన్ని ఇష్టపడతాడు. ఐపీఎల్లో బెంగళూరును నడిపిన తరహాలో జాతీయ జట్టును కూడా నడిపితే కోహ్లి మంచి ఫలితాలు సాధిస్తాడు’ అని స్యామీ అన్నాడు. ఐపీఎల్లో స్యామి బెంగళూరు జట్టుకు ఆడాడు. -
కోహ్లికి సమయం ఇవ్వాలి
భారత జట్టు కెప్టెన్‌గా నిలదొక్కుకోవడానికి సమయం పడుతుందని, విరాట్ కోహ్లికి తగినంత సమయం ఇవ్వాలని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇప్పుడే ఫలితాల గురించి, ప్రణాళికల గురించి చర్చించడం అనవసరమన్నారు. -
సరైన నిర్ణయం: గవాస్కర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియామకాన్ని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించారు. టెస్టుల్లో ధోని సేన వైఫల్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనని అన్నారు. టీమ్ డెరైక్టర్ పదవికి శాస్త్రి అర్హుడేనని ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు టెస్టు సిరీస్ ఓటమిపై తీవ్ర విమర్శలెదుర్కొంటున్న కెప్టెన్ ధోనికి గవాస్కర్ అండగా నిలిచారు. భారత జట్టు కెప్టెన్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు. -
మహీ కెప్టెన్ పదవి.. మాస్టర్ చలవే
ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్లలో ఒకడిగా మహేంద్ర సింగ్ ధోనీ పేరు సంపాదించి ఉండొచ్చు. అతనిలో నాయకత్వ లక్షణాలను తొలుత గుర్తించింది మాత్రం సచిన్ టెండూల్కర్. టీమిండియా కెప్టెన్ పదవికి ధోనీ పేరును మొదట ప్రతిపాదించి కూడా సచినే. 2007లో రాహుల్ ద్రావిడ్ వైదొలిగినపుడు అతని స్థానంలో ధోనీని ఎంపిక చేస్తే అత్యుత్తమ సారథి అవుతాడని సచిన్ మద్దతు పలికాడు. తనకు అవకాశం వచ్చినా కాదనుకుని సచిన్ ధోనీకి మద్దతు పలికాడు. ఈ విషయాల్ని ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్ వెల్లడించాడు. ఆ సమయంలో పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. 'కొన్నేళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న నేనూ లండన్‌లో ఉన్నాను. ఓ రోజు ద్రావిడ్ నా వద్దకు వచ్చి కెప్టెన్‌గా వైదొలగాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అతని నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కెప్టెన్ పదవికి సచిన్ పేరును ద్రావిడ్ ప్రతిపాదించాడు. ఈ విషయం గురించి సచిన్‌తో నేను మాట్లాడాను. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సచిన్ అంగీకరించలేదు. తన బదులు ధోనీని ఎంపిక చేయాలని సూచించాడు. కెప్టెన్‌గా ధోనీ సమర్థవంతంగా పనిచేయగలడా అని సందేహం వ్యక్తం చేశాను. అవకాశమిస్తే మహీ అత్యుత్తమ కెప్టెన్ కాగలడని సచిన్ నన్ను ఒప్పించాడు. అనంతరం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దేశం గర్వించగల కెప్టెన్‌గా మహీ నిరూపించుకున్నాడు' అని పవార్ తెలిపారు. సచిన్ ఎప్పుడూ సహచరులకు, ముఖ్యంగా జూనియర్లకు అండగా ఉంటాడని పవార్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.