
269 పరుగులు సాధించిన భారత కెప్టెన్
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 587
ఇంగ్లండ్ ప్రస్తుతం 77/3
మరో 510 పరుగులు వెనుకంజ
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్‌తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించాడు.
8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు.
గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్‌దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయం.
బరి్మంగ్‌హామ్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్‌లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్‌బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది.
జడేజా చేజారిన సెంచరీ
మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్‌లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు.
టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్‌కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్‌లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది.
కొనసాగిన జోరు
రెండో సెషన్‌లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్‌కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు.
ఎట్టకేలకు సుందర్‌ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్‌లో భారత్ 31 ఓవర్లలో ఓవర్‌కు 4.6 రన్‌రేట్‌తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్‌ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది.
టపటపా
ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్‌దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్‌ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్‌దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587.
వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587.
బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77.
వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25.
బౌలింగ్: ఆకాశ్‌దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0.