అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో రోహిత్‌ ఒకడు: టీమిండియా కోచ్‌ | Sakshi
Sakshi News home page

Rohit Sharma: రోహిత్‌ బొద్దుగా కనిపించినా కోహ్లి మాదిరే ఫిట్‌గా ఉంటాడు: టీమిండియా కోచ్‌

Published Mon, Dec 11 2023 1:31 PM

Rohit Sharma Looks Bit Bulky But: India Coach Comparison to Virat Kohli - Sakshi

టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి గురించి స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ అంకిత్‌ కలియార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ చూడటానికి బొద్దుగా కనిపించినా.. కోహ్లి మాదిరిగానే అతడూ పూర్తి ఫిట్‌గా ఉంటాడని పేర్కొన్నాడు. మైదానంలో హిట్‌మ్యాన్‌ కదలికలు చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుందని అంకిత్‌ కలియార్‌ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు.

అదే విధంగా.. ఫిట్‌నెస్‌ విషయంలో కోహ్లి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడన్న అంకిత్‌.. భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై ఇంతగా అవగాహన పెంచుకోవడానికి అతడే ప్రధాన కారణమని కొనియాడాడు. యువ ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్‌ కోహ్లి మాదిరే సూపర్‌ ఫిట్‌గా ఉంటాడని.. విరాట్‌ భాయ్‌ తన రోల్‌ మోడల్‌గా భావిస్తాడని చెప్పుకొచ్చాడు.

ఈ మేరకు భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ శర్మ ఫిట్‌గా ఉంటాడు. మిగతా వాళ్లతో పోలిస్తే చూడటానికి కాస్త భారీ కాయుడిలా అనిపించినా.. మైదానంలో పాదరసంలా కదలగలడు.

అతడు ప్రతిసారీ యో- యో టెస్టు పాసయ్యాడు కూడా! అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో రోహిత్‌ శర్మ పేరు కూడా ఉంటుంది. కోహ్లి ఎంత ఫిట్‌గా ఉంటాడో రోహిత్‌ కూడా అంతే ఫిట్‌గా ఉంటాడు. అయితే, ఫిట్‌నెస్‌ విషయంలో కొలమానం అంటే విరాట్‌ కోహ్లి పేరునే చెప్పాల్సి ఉంటుంది.

టీమిండియాలో దీనిని ఒక సంస్కృతిగా మార్చిన ఘనత కోహ్లికే దక్కుతుంది. అగ్రశ్రేణి ఆటగాడిని మిగతా ప్లేయర్లూ అనుసరించే అవకాశం ఉంటుంది. కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లి ప్రతి ఒక్కరిని ఫిట్‌నెస్‌ విషయంలో మోటివేట్‌ చేశాడు.

విరాట్‌ భాయ్‌ మూలంగానే ఇప్పుడు చాలా మంది టీమిండియా ప్లేయర్లు ఫిట్‌గా కనిపిస్తున్నారు. శుబ్‌మన్‌ గిల్‌కు కోహ్లినే ఆదర్శం. కేవలం ఫిట్‌నెస్‌ విషయంలోనే కాకుండా ఆటలోనూ విరాట్‌ భాయ్‌ను తన రోల్‌మోడల్‌గా భావిస్తాడు. ప్రతి విషయంలోనూ కోహ్లినే ఫాలో అవుతూ ఉంటాడు. రానున్న కాలంలో గిల్‌ జట్టుకు విలువైన ఆస్తిగా మారతాడు’’ అని అంకిత్‌ కలియార్‌ పేర్కొన్నాడు. 

కాగా టీమిండియా క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూ బీసీసీఐ యో- యో టెస్టును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో గిల్‌.. కోహ్లి యో-యో స్కోరును దాటేడయం విశేషం. ఇదిలా ఉంటే.. ఎల్లప్పుడూ కేవలం ఈ టెస్టు స్కోరు ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందని చెప్పలేం. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement