భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పోటీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే రఫ్ఫాడించాడు. తీవ్ర గాయం కారణంగా రెండు నెలలు ఆటకు పూర్తిగా దూరమైన శ్రేయస్.. ఇవాళ (జనవరి 6) హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. వచ్చీ రాగానే మెరుపు అర్ద శతకంతో అదరగొట్టాడు. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు.
శ్రేయస్‌తో పాటు ముషీర్ ఖాన్ (73) కూడా రాణించడంతో హిమాచల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై 29 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఈ మ్యాచ్‌ను 33 ఓవర్లకే కుదించారు. ముంబై ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 15, సర్ఫరాజ్ ఖాన్ 21, సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేయగా.. శివమ్ దూబే 20, హార్దిక్ తామోర్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్ 25న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ ప్రమాదకరంగా కిందపడ్డాడు. క్యాచ్ అయితే పట్టగలిగాడు కాని, ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కిందపడ్డాక నొప్పితో విలవిలలాడిపోయిన శ్రేయస్‌ను హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో పెట్టి చికిత్సనందించారు. తొలుత గాయం చిన్నదే అని అంతా అనుకున్నారు.
అయితే డాక్టర్లు నెమ్మదిగా విషయాన్ని చెప్పారు. శ్రేయస్ స్ప్లీన్‌లో (ప్లీహం) చీలక వచ్చి, అంతర్గత రక్తస్రావమైందని తెలిపారు. ఒకటి, రెండు రోజుల వరకు ఏమీ చెప్పలేమని కూడా అన్నారు. అయితే దైవానుగ్రహం, డాక్టర్లు కృషి వల్ల శ్రేయస్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సాధారణ స్థితికి చేరాడు.
అనంరతం నెల రోజుల పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉండి, తాజాగా పోటీ క్రికెట్‌లో పాల్గొనేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాడు. శ్రేయస్ త్వరలో ప్రారంభం కాబోయే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు సన్నాహకంగా శ్రేయస్ విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు.
ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్ తర్వాత జనవరి 8న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో శ్రేయసే ముంబై జట్టును ముందుండి నడిపిస్తాడు. ముంబై రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)శ్రేయస్‌కు అప్పగించింది.


