
లార్డ్స్ టెస్టులో గెలుపు తమదేనని టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఐదో రోజు ఆటలో భోజన విరామ సమయం తర్వాత తాము గెలుపు జెండా ఎగురవేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. బదులుగా టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా అంతే స్కోరు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 192 పరుగులకే పడగొట్టేశారు. ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జో రూట్ (40), కెప్టెన్ బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (8)ల రూపంలో మూడు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు.. ఆఖర్లో షోయబ్ బషీర్ (2)ను పెవిలియన్‌కు పంపాడు.
మిగతా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో ఆదివారమే లక్ష్య ఛేదన (193)కు దిగిన గిల్ సేన.. ఆట పూర్తయ్యేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు ఆటలో టీమిండియా 135 పరుగులు చేస్తే లార్డ్స్‌లో విజయభేరి మోగించగలదు.
ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. ‘‘మేము గెలవబోతున్నాము. మొదటి సెషన్‌లోనే ఈ పని పూర్తి కావచ్చు. బహుశా లంచ్ తర్వాత మా విజయం లాంఛనమే. ప్రస్తుతం మేము పటిష్ట స్థితిలోనే ఉన్నాము.
అయితే, ఆట ముగిసే సరికి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఉంటే.. ఇంకాస్త ముందుగానే విజయం వరించేది. ఏదేమైనా ఆదివారం మేము అద్భుతంగా బౌలింగ్ చేశాము. ఒత్తిడి ఉన్నా ఎక్కడా తడబడలేదు’’ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. 58/4 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (9).. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే కేఎల్ రాహుల్ (39) కూడా వెనుదిరిగాడు.స్టోక్స్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 23.5 ఓవర్లలో 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
అంతకుముందు.. యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (6), ఆకాశ్ దీప్ (1) పూర్తిగా నిరాశపరిచారు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించి.. సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే.