
టీమిండియా- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య మూడో టెస్టు ముగింపు దశకు చేరుకుంది. సోమవారం నాటి ఆటలో పైచేయి సాధించిన జట్టునే విజయం వరించనుంది. భారత్ గెలుపొందాలంటే ఆఖరి రోజు 135 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.
మొదటి గంట కీలకం
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోతిక్ (Marcus Trescothick) టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘నాలుగోరోజు ఆట ఆఖర్లో మా వాళ్లు అద్భుతం చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా మాకు విశేషమైన స్పందన లభించింది. వారి కేరింతలు మా వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.
ఆరు వికెట్లు పడగొడతాం
రేపు (సోమవారం) మొదటి గంట కీలకం. అప్పుడు టీమిండియా ఏమేరకు ఆధిపత్యం కొనసాగిస్తుందో.. ఏ మేర సానుకూల దృక్పథంతో ఉంటుందో చూడాలి. ఫస్ట్ అవర్‌లో మేమైతే మిగిలిన ఆ ఆరు వికెట్లు కూలుస్తామనే నమ్మకం ఉంది’’ అంటూ మార్కస్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఆట పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండగా.. లార్డ్స్‌లో మూడో టెస్టు జరుగుతోంది.
387- 387
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి.. 387 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ (104) సెంచరీతో సత్తా చాటగా.. జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ధ శతకాలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.
అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (100) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా (74) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మూడు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో రెండు, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా, సిరాజ్ రెండేసి వికెట్లు కూల్చారు. నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఆదివారం నాలుగు వికెట్లు నష్టపోయి.. 58 పరుగులు చేసింది.