మద్యం మత్తులో కారు యాక్సిడెంట్ చేసిన కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జేకబ్ మార్టిన్ అరెస్ట్ అయ్యాడు. ఇవాళ (జనవరి 27) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను వడోదర నగరంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో జేకబ్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
జేకబ్ తన ఎంజీ హెక్టార్ కారుతో హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సిలేరియో, కియా సెల్టోస్ కార్లను ఢీకొట్టాడు. మద్యంపై ఉండటంతో నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు కేసు కట్టారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
పోలీసులు జేకబ్‌ను అదుపులోకి తీసుకొని, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటర్ వెహికిల్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కొద్ది గంట్లోనే జేకబ్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. కానీ, కారు పోలీసుల ఆధీనంలోనే ఉంది.
53 ఏళ్ల జేకబ్ మార్టిన్ 1999-2001 మధ్యలో భారత్ తరఫున 10 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, దేశీయ క్రికెట్‌లో (బరోడా, రైల్వేస్, అస్సాం) అతనికి మంచి రికార్డు ఉంది. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 శతకాల సాయంతో 9192 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలోనూ 2948 పరుగులు (3 సెంచరీలు) చేశాడు. జేకబ్ బరోడా కెప్టెన్‌గా కూడా సేవలందించాడు.
కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన జేకబ్ దేశవాలీ కెరీర్‌లో 19 వికెట్లు తీశాడు. క్రికెటర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత జేకబ్ జీవితం వివాదాలు, ప్రమాదాలతో నిండిపోయింది. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఊపిరితిత్తులు, కాలేయానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో జేకబ్ కుటుంబానికి బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కృనాల్ పాండ్యా వంటి వారు ఆర్థిక సహాయం చేశారు.


