కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 27) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదాడు. మరో ఎండ్‌లో జో రూట్ కూడా బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. వీరిద్దరి ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది.
జేకబ్ బేతెల్ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) ఔటయ్యాక 31.1వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన బ్రూక్ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. పడ్డ బంతిని పడ్డట్టు బౌండరీ లేదా సిక్సర్‌కు తరలించాడు. బ్రూక్ విధ్వంసాన్ని తట్టుకోలేక లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓ పక్క బ్రూక్ చెలరేగుతుంటే రూట్ నిదానంగా తన 20వ వన్డే శతకాన్ని (100 బంతుల్లో), 61వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేశాడు.
కఠినమైన పిచ్‌పై వీరిద్దరు నాలుగో వికెట్‌కు 113 బంతుల్లో అజేయమైన 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 42 ఓవర్ల తర్వాత 38 పరుగులుగా (32 బంతుల్లో) ఉండిన బ్రూక్ స్కోర్ 50 ఓవర్ ముగిసే సరికి 66 బంతుల్లో అజేయమైన 136 పరుగులైంది. దీన్ని బట్టి చూస్తే బ్రూక్ విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగిందో అర్దమవుతుంది. చివరి 8 ఓవర్లలో బ్రూక్ 34 బంతులు ఎదుర్కొని ఏకంగా 98 పరుగులు బాదాడు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో మొత్తం 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
మరోవైపు బాధ్యతాయుతంగా సెంచరీ పూర్తి చేసిన రూట్.. జోరు మీదున్న బ్రూక్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తూ అజేయమైన 111 పరుగుల వద్ద (108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌ను ముగించాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లలో రెహాన్ అహ్మద్ 24, బెన్ డకెట్ 7 పరుగులు చేసి ఔటయ్యారు.
లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, హసరంగ, వాండర్సే తలో వికెట్ తీశారు. వెల్లాలగే (10-0-49-0), లియనగే (3-1-7-0) మినహా మిగతా లంక బౌలర్లందరినీ బ్రూక్ ఆటాడుకున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డే శ్రీలంక గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.


