బ్యాట్‌ను నేలకేసి కొట్టిన సిరాజ్‌!.. ఓటమిపై స్పందన ఇదే | Some Matches: Siraj Pens Heartfelt Note He Punches Bat In Anger Unseen Video | Sakshi
Sakshi News home page

బ్యాట్‌ను నేలకేసి కొట్టిన సిరాజ్‌!.. అన్‌సీన్‌ వీడియో.. ఓటమిపై స్పందన ఇదే

Jul 16 2025 6:33 PM | Updated on Jul 16 2025 6:54 PM

Some Matches: Siraj Pens Heartfelt Note He Punches Bat In Anger Unseen Video

లార్డ్స్‌ టెస్టులో గెలుపు కోసం చివరిదాకా పోరాడిన టీమిండియాకు చేదు అనుభవమే మిగిలింది. మూడో టెస్టులో ఆఖరిదైన ఐదో రోజు ఆటలో అనూహ్య రీతిలో మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) బౌల్డ్‌ కావడంతో గిల్‌ సేన ఓటమి ఖరారైంది. ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 22 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. మరోసారి లార్డ్స్‌లో తమకు తిరుగులేదని నిరూపించుకుంది.

అంతేకాదు.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నిజానికి.. ఐదో రోజు ఆరంభంలోనే టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌ (9) బౌల్డ్‌ కాగా.. ఆ తర్వాత ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (39) కూడా ఊహించని రీతిలో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు.

జడేజా ఒంటరి పోరాటం
ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (0) డకౌట్‌ అయ్యాడు. అనంతరం నితీశ్‌ రెడ్డి (53 బంతుల్లో 13) కాసేపు నిలబడినా.. క్రిస్‌ వోక్స్‌ అద్భుత డెలివరీతో అతడిని వెనక్కిపంపించేశాడు. ఈ క్రమంలో బాధ్యతను నెత్తికెత్తుకున్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (61 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు.

అతడికి తోడుగా టెయిలెండర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (54 బంతుల్లో 5) చాలాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి సామ్‌ కుక్‌కు క్యాచ్‌ ఇచ్చి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగడంతో టీమిండియా అభిమానుల్లో గెలుపు ఆశలు దాదాపుగా చచ్చిపోయాయి. మహ్మద్‌ సిరాజ్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడంటూ అంతా ఉసూరుమన్నారు.

పాపం సిరాజ్‌ మియా..
అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సిరాజ్‌ మియా 29 బంతుల్ని ఎదుర్కొని డిఫెండ్‌ చేసుకున్నాడు. ముప్పైవ బంతిని కూడా బాగానే డిఫెంగ్‌ చేసుకున్నా అనుకున్నాడు. కానీ ఊహించని రీతిలో బంతి పిచ్‌ మీద రోల్‌ అయి లెగ్‌ స్టంప్‌ను తాకగా బెయిల్‌ ఎగిరిపడింది.

ఊహించని ఈ పరిణామంతో సిరాజ్‌తో పాటు టీమిండియా హృదయం కూడా ముక్కలైంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ షోయబ్‌ బషీర్‌ స్పిన్‌ మాయాజాలంతో అలా సిరాజ్‌ పదో వికెట్‌గా వెనుదిరగ్గా.. లార్డ్స్‌లో టీమిండియా మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో కోపంతో సిరాజ్‌ బ్యాట్‌ను నేలకేసి కొట్టిన వీడియోతో పాటు.. ఓటమి నేపథ్యంలో అతడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారాయి.

ఓటమిపై స్పందన ఇదే
‘‘కొన్ని మ్యాచ్‌లు మన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే, కేవలం ఫలితం ఆధారంగా మాత్రమే కాదు.. అవి నేర్పిన పాఠాల వల్ల అలా గుర్తుండిపోతాయి’’ అంటూ సిరాజ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు పూర్తి కాగా.. ఆతిథ్య జట్టు రెండు, పర్యాటక టీమిండియా ఒక మ్యాచ్‌ గెలిచాయి. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్‌లో నాలుగో మ్యాచ్‌ జరుగనుంది. 

చదవండి: వాళ్లిద్దరిలో అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరు?.. కుండబద్దలు కొట్టేసిన లారా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement