
ముత్తయ్య మురళీధరన్- లారా- వార్న్ (PC: ICC/X)
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ స్పిన్నర్లుగా పేరొందారు శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan).. ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ (Shane Warne). మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 1347 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు ముత్తయ్య మురళీధరన్.
మరోవైపు.. 1001 వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు దివంగత షేన్ వార్న్. సమకాలీన బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ ఇద్దరు స్పిన్ బౌలర్లలో ఎవరు అత్యుత్తమం అంటే చెప్పడం కాస్త కష్టమే. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియన్ లారా కూడా ఇదే మాట అంటున్నాడు. అయితే, షేన్ వార్న్- ముత్తయ్య మురళీధరన్‌లలో ఒకరు మాత్రం ఇంకాస్త బెస్ట్ అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు.
ఇద్దరూ ఇద్దరే
ఈ మేరకు.. ‘‘మురళి బౌలింగ్ చేస్తున్నపుడు నన్ను గందరగోళానికి గురిచేస్తాడు. స్వీప్ షాట్ లేదంటే.. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ మీదుగా షాట్ బాదాలని అనుకుంటే.. అతడు నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తాడు. మరోసారి నేను స్వీప్ షాట్ ఆడాలని అనుకున్నపుడు సడన్‌గా ఇంకో డెలివరీతో ముందుకు వస్తాడు.
సర్లే నా వ్యూహం మార్చుకుందామని అనుకుంటే.. తను ఊహించని రీతిలో అటాక్ చేస్తాడు. లారా అయినా.. ఎవరైనా సరే ఆ బ్యాటర్ వికెట్ పడగొట్టాలనేదే అతడి లక్ష్యం. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో షేన్ వార్న్ దిట్ట. అయితే, నా వరకు మురళీ.. వార్న్ కంటే ఎక్కువగా ఒత్తిడిలోకి నెట్టేస్తాడు.
అతడికే ఎక్కువ రేటింగ్
అయితే, షేన్ వార్న్ బౌలింగ్‌లో.. ముఖ్యంగా మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో అతడు అద్భుతమైన స్పెల్‌తో మాయాజాలం చేయగలడు. తనలా ఇంకెవరూ మ్యాజికల్ స్పెల్ వేయలేరు. కాబట్టి నేను ఈ ఇద్దరిలో వార్న్‌కు ఎక్కువ రేటింగ్ ఇస్తాను.
ఎందుకంటే.. మానసికంగానూ అతడు చాలా బలవంతుడు. తనకు అనుకూలించే పిచ్‌ల మీద ఆత్మవిశ్వాసంతో దూకుడు ప్రదర్శించగల సత్తా అతడి సొంతం. అతడొక ప్రత్యేకమైన బౌలర్’’ అంటూ బ్రియన్ లారా తన ఓటును షేన్ వార్న్‌కే వేశాడు.
‘ది ఓవర్‌లాప్ క్రికెట్’ షోలో ఈ మేరకు అత్యుత్తమ స్పిన్నర్ ఎవరన్న అంశంపై లారా తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు. కాగా 52 ఏళ్ల వయసులో షేన్ వార్న్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. మార్చి 4, 2022లో థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నపుడు గుండెపోటుతో అతడు మరణించాడు.
ఇక మేటి బ్యాటర్లలో ఒకడైన బ్రియన్ లారా.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ (400)తో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. కాగా లారా 1990- 2007 వరకు విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 131 టెస్టుల్లో 11953 పరుగులు, 299 వన్డేల్లో 10405 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 34 సెంచరీలు, 9 డబుల్ సెంచరీలు చేసిన లారా ఖాతాలో... 19 వన్డే శతకాలు కూడా ఉన్నాయి.
చదవండి: జడేజా దూకుడుగా ఆడాల్సింది!.. టీమిండియా దిగ్గజాలకు ఇచ్చిపడేసిన పుజారా