
లార్డ్స్ టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతం. టాపార్డర్ చేతులెత్తేసిన వేళ.. టెయిలెండర్లతో కలిసి ఒక్కో పరుగు జత చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. భారీ తేడాతో ఓటమి ఖాయమనుకున్న తరుణంలో.. తన నిలకడైన బ్యాటింగ్‌తో భారత శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించాడు.
అయితే, దురదృష్టవశాత్తూ టెయిలెండర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) పదో వికెట్‌గా వెనుదిరడంతో.. టీమిండియా ఓటమి ఖరారైంది. ఆఖరికి 22 పరుగుల తేడాతో గిల్ సేన పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా 181 బంతులు ఎదుర్కొని అర్ధ శతకం (61; 4 ఫోర్లు, ఒక సిక్సర్) సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన జడేజా పోరాటం వృథా అయిపోయింది.
జడేజా దూకుడుగా ఆడాల్సింది!
అయితే, జడ్డూ జిడ్డు ఇన్నింగ్స్ ఆడకుండా ఉండాల్సిందంటూ టీమిండియా దిగ్గజాలు అనిల్ కుంబ్లే, సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) వంటి వాళ్లు అతడిని విమర్శించడం గమనార్హం. జడేజా కాస్త దూకుడుగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వీరు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ ఛతేశ్వర్ పుజారా మాత్రం భిన్నంగా స్పందించాడు. వీరోచిత పోరాటం చేసిన జడేజాను విమర్శించడం ఎంతమాత్రమూ సరికాదంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.
గొప్పగా బ్యాటింగ్ చేశాడు
‘‘ఆ పిచ్‌పై జడేజా వేగంగా పరుగులు చేయడానికి ఆస్కారం లేదు. వికెట్ స్వభావం అలా ఉంది. టెయిలెండర్లు వికెట్ కాపాడుకుంటే.. నెమ్మదిగా అయినా సరే అతడు జట్టును లక్ష్యానికి మరింత చేరువగా తీసుకువచ్చేవాడు.
అప్పుడు తనలోని దూకుడును బయటకు తీసి పని పూర్తి చేసేవాడు. నిజానికి అతడు గొప్పగా బ్యాటింగ్ చేశాడు. ఏదేమైనా అలాంటి పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టతరమనే చెబుతాను.
అయితే, జడేజా స్ట్రెయిట్‌డౌన్ షాట్లు ఆడితే బాగుండేది. అదొక్కటే కాస్త మిస్ అయిందని చెప్పవచ్చు’’ అని పుజారా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది టీమిండియా.
ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. అయితే, లార్డ్స్‌లో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు (జూలై 23- 27) జరుగనుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్- మూడో టెస్టు సంక్షిప్త స్కోర్లు
🏏ఇంగ్లండ్: 387 & 192
🏏భారత్: 387 & 170.
చదవండి: అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే