
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. లార్డ్స్ (Lord's Test)లో ఆడించిన తుదిజట్టునే మాంచెస్టర్‌లోనూ కొనసాగించాలని సూచించాడు. మూడో టెస్టులో టీమిండియా బాగానే ఆడిందని... అయితే, ఆఖరి వరకు పోరాడినా దురదృష్టవశాత్తూ ఓటమిపాలైందని పేర్కొన్నాడు.
పొరపాట్లను సరిచేసుకుంటే నాలుగో టెస్టులో అనుకున్న ఫలితాన్ని రాబట్టవచ్చని.. కానీ ఇందుకోసం తుదిజట్టులో మాత్రం మార్పులు అవసరం లేదని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది.
ఆధిక్యంలో ఆతిథ్య జట్టు
ఈ క్రమంలో తొలుత లీడ్స్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. రెండో టెస్టులో భారత్ ఎడ్జ్‌బాస్టన్‌లో జయభేరి మోగించింది. ఇక ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన లార్డ్స్ టెస్టులో మాత్రం గిల్ సేన 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 2-1తో ఆధిక్యం దక్కింది.
కరుణ్ నాయర్ వరుస వైఫల్యాలు
కాగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (16, 6)తో పాటు కీలక ఆటగాళ్లు యశస్వి జైస్వాల్(13, 0 ), కరుణ్ నాయర్ (40, 14) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ సైతం తొలి ఇన్నింగ్స్ (74)లో రనౌట్ కావడం.. రెండో ఇన్నింగ్స్ (9)లో ఫెయిల్ అవడం టీమిండియా కొంపముంచింది.
అయితే, వీరిలో ప్రధానంగా కరుణ్ నాయర్ వరుస వైఫల్యాల కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన ఈ విదర్భ స్టార్‌కు ఇంగ్లండ్‌లో వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం ఇందుకు కారణం.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కరుణ్ ఇప్పటి వరకు చేసిన స్కోర్లు వరుసగా.. 0, 20, 31, 26, 40, 14. ముఖ్యంగా లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు అవుటైన తీరు అభిమానులకు సైతం ఆగ్రహం తెప్పించింది. దీంతో అతడిపై వేటు వేయాలనే డిమాండ్లు పెరిగాయి.
పంత్ విషయంలో నో క్లారిటీ
ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే మాత్రం కరుణ్ నాయర్‌కు మద్దతుగా నిలవడం విశేషం. నాలుగో టెస్టులో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘మాంచెస్టర్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితేనే బాగుంటుంది. నిజానికి లార్డ్స్‌లో మనవాళ్లు అద్భుతంగా ఆడారు.
అవును.. మనం 22 పరుగుల తేడాతో ఓడిపోయిన మాట వాస్తవమే. అయినా మనవాళ్లు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతం. గాయాల బెడదలు లేకుంటే ఇదే జట్టుతో కొనసాగవచ్చు. అయితే, రిషభ్ పంత్ (వేలికి గాయం) విషయంలో మాత్రం నేనేమీ కచ్చితంగా చెప్పలేను.
అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి
మరొక విషయం.. కరుణ్ నాయర్ తన చోటును పదిలం చేసుకుంటాడనే అనుకుంటున్నాను. ఎందుకంటే.. తొలి ఇన్నింగ్స్‌లో అతడు రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అతడు అవుటైన తీరు నిరాశపరిచినా.. అతడి బ్యాటింగ్‌కు మాత్రం పేరుపెట్టలేము. అతడు నెలకొల్పిన భాగస్వామ్యం కూడా మ్యాచ్‌లో కీలకమైనదే.
తొలి ఇన్నింగ్స్‌లో ఒకవేళ నాయర్ ముందే అవుటై ఉంటే.. అప్పుడు గిల్ మరింత ముందుగానే కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చేది. తొలి 20- 25 ఓవర్లు కీలకం. కాబట్టి ఈ విషయంలో నాయర్‌ను తప్పుబట్టడానికి లేదు. అతడు దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు.
జో రూట్ అద్భుతమైన క్యాచ్ పట్టడం వల్ల వెనుదిరిగాడు. కాబట్టి ఇంకొక్క అవకాశం పొందేందుకు కరుణ్ నాయర్ అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా జూలై 23- 27 మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
Ups & downs, fightbacks & heartbreaks, Day 5 of the Lord's Test had it all! 🙌
"In the end, Cricket was the real winner!" ❤#ENGvIND | 4th Test starts WED, 23rd JULY, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/ak9WkvZ2G2— Star Sports (@StarSportsIndia) July 14, 2025