
తాజాగా ముగిన లార్డ్స్ టెస్ట్‌లో వీరోచితమైన పోరాటం చేసి భారత్‌ను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించి విఫలమైన రవీంద్ర జడేజా ఓ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ భారత్‌ను గెలిపించే ప్రయత్నంలో భాగంగా అజేయమైన 61 పరుగులు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
తద్వారా క్రికెట్ చరిత్రలో 7000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడంతో పాటు 600కు పైగా వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు కపిల్ దేవ్, షాన్ పొల్లాక్, షకీబ్ అల్ హసన్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
కపిల్ 356 మ్యాచ్‌ల్లో 9031 పరుగులు చేసి 687 వికెట్లు తీయగా.. పొల్లాక్ 423 మ్యాచ్‌ల్లో 7386 పరుగులు, 829 వికెట్లు.. షకీబ్ 447 మ్యాచ్‌ల్లో 14730 పరుగులు, 712 వికెట్లు తీశారు. జడేజా విషయానికొస్తే.. లార్డ్స్ టెస్ట్‌తో కలుపుకొని జడ్డూ 302 ఇన్నింగ్స్‌ల్లో 33.41 సగటున, నాలుగు సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 7018 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 29.33 సగటున 17 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 611 వికెట్లు తీశాడు.
ఫార్మాట్ల వారీగా చూస్తే.. గతేడాది పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జడ్డూ.. ఈ ఫార్మాట్‌లో 41 ఇన్నింగ్స్‌ల్లో 515 పరుగులు చేసి, 71 ఇన్నింగ్స్‌ల్లో 54 వికెట్లు తీశాడు.
వన్డేల విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో 137 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన జడ్డూ 32.63 సగటున 13 అర్ద శతకాల సాయంతో 2806 పరుగులు చేసి, 196 ఇన్నింగ్స్‌ల్లో 231 వికెట్లు తీశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పోలిస్తే జడేజాకు టెస్ట్‌ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.
సుదీర్ఘ ఫార్మాట్‌లో జడ్డూ 124 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 26 అర్ద సెంచరీల సాయంతో 36.97 సగటున 3697 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 156 ఇన్నింగ్స్‌ల్లో 15 ఐదు వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 326 వికెట్లు తీశాడు.
కాగా, లార్డ్స్ టెస్ట్‌లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.