ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్‌లలో మార్పులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్‌ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ధ్రువీకరించారు.
బోర్డు సంతృప్తితో లేదు
‘‘A+ గ్రేడ్‌ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్‌లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.
ఈ గ్రేడ్‌లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్‌ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్‌స్టార్‌తో పేర్కొన్నారు.
రో-కో వన్డేలలో మాత్రమే
కాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలతో పాటు.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.
మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్‌గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.
బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?
ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.
చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్!


