
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. చారిత్రాత్మక గెలుపు కారణంగా తుదిజట్టు ఎంపిక విషయంలో చేసిన కొన్ని పొరపాట్లు కనుమరుగైపోయాయని పేర్కొన్నాడు. ఫలితం అనుకూలంగా రాకపోయి ఉంటే.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవని అభిప్రాయపడ్డాడు.
కాగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా (IND vs ENG).. లీడ్స్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, అందుకు ప్రతీకారం తీర్చుకుని ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసి చారిత్రాత్మక విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్‌లపై మాత్రం వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాల్లో ఆకాశ్ దీప్ (Akash Deep), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)లను జట్టులోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. సాయి సుదర్శన్‌పై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతడిని తప్పించాల్సిన అవసరం లేదని.. మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. నిజానికి కరుణ్ నాయర్ వన్‌డౌన్ బ్యాటర్ కాదని.. సాయి ఈ స్థానంలో సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు.
ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?..
‘‘గత మ్యాచ్‌లో టీమిండియా యాజమాన్యం కొన్ని ఆసక్తికర ఎంపికలు చేసింది. వాటితో నేను ఏమాత్రం ఏకీభవించడం లేదు. రెండో టెస్టులో గెలిచిన కారణంగా ఇవన్నీ కనుమరుగైపోయాయి.
నిజానికి సాయి సుదర్శన్ విషయంలో వారు చేసింది తప్పు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ యువ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాల్సింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బాగానే ఆడాడు. కాబట్టి రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాల్సింది.
కానీ వాళ్లు అతడిని తప్పించారు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ సరైన బ్యాటర్. కరుణ్ నాయర్‌ను వన్‌డౌన్‌లో ఆడించడం సరికాదు. విఫలమైనా కరుణ్‌కి అవకాశాలు ఇచ్చినప్పుడు సాయి సుదర్శన్‌కు కూడా ఛాన్స్ ఇవ్వాల్సింది కదా!
అతడి కోసం నితీశ్ రెడ్డి త్యాగం చేయాల్సింది
అలా అని నేనేమీ కరుణ్ నాయర్‌కు వ్యతిరేకం కాదు. చాలా ఏళ్ల తర్వాత కష్టపడి అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, అతడు మాత్రం వన్‌డౌన్‌లో ఆడే బ్యాటర్ మాత్రం కాదు. నిజానికి లోయర్ ఆర్డర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కరుణ్ కోసం త్యాగం చేయాల్సింది’’ అని మంజ్రేకర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.
కాగా లీడ్స్ టెస్టుతో టీమిండియా తరఫున సంప్రదాయ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మరోవైపు.. కరుణ్ నాయర్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 20 పరుగులే చేశాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి లార్డ్స్‌లో మూడో టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్‌తో బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.