డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ కలిదిండి నరసింహ (కేఎస్‌ఎన్) రాజు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును నామమాత్రపు స్కోరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
దేశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో దశ మ్యాచ్‌లు గురువారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎలో భాగమైన విజయనగరం వేదికగా ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది.
యశ్ రాథోడ్ శతకం
మ్యాచ్ ఆరంభం నుంచే ఆంధ్ర బౌలర్లు కట్టిపడేయడంతో విదర్భ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, యశ్ రాథోడ్ (Yash Rathod- 104 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు.. ఈ సీజన్‌లో దంచి కొడుతున్న అమన్ మోఖడే (21), దానిశ్ మాలేవర్ (0), అథర్వ తైడె (13), సమర్థ్ (9)లను కేఎస్‌ఎన్ రాజు తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో విదర్భ ఒక దశలో 45/4తో కష్టాల్లో పడింది.
ఈ సమయంలో యశ్ రాథోడ్ గొప్ప సంయమనం కనబర్చాడు. మొదట రోహిత్‌తో ఐదో వికెట్‌కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ అండతో జట్టును ముందుకు నడిపాడు. ఫలితంగా గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.
మరో 28 పరుగులు జతచేసి
ఈ క్రమంలో 267/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన విదర్భ మరో 28 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో రాజు ఐదు వికెట్లు (5/62) కూల్చగా.. కావూరి సాయితేజ యశ్ రాథోడ్ (115), రోహిత్ బింకర్ (37) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పార్థ్ రేఖడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లు ఆడి 295 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆంధ్ర జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది.


