ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌ | England Penalised For Slow Over Rate In Lord’s Test | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు బిగ్‌ షాక్‌

Jul 16 2025 12:51 PM | Updated on Jul 16 2025 4:55 PM

England Penalised For Slow Over Rate In Lord’s Test

తాజాగా ముగిసిన లార్డ్స్‌ టెస్ట్‌లో భారత్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించి, గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్‌ చేసినందుకు గానూ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజుల్లో 10 శాతం కోత విధించడంతో పాటు రెండు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను కట్‌ చేసింది. ఎమిరేట్స్‌ ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌ ఆఫ్‌ మ్యాచ్‌ రిఫరీస్‌ సభ్యుడు రిచీ రిచర్డ్‌సన్‌ ఇంగ్లండ్‌పై చర్యలకు ఆదేశించాడు.

నిర్దేశిత సమయంలోపు ఇంగ్లండ్‌ రెండు ఓవర్లు వెనుకపడిందని రిచర్డ్‌సన్‌ తెలిపాడు. స్లో ఓవర్‌ రేట్‌ అనేది ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లోని ఆర్టికల్‌ 2.22 ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నాడు. స్లో ఓవర్‌ రేట్‌ నిబంధన ఉల్లంఘన కింద ఒక్కో ఓవర్‌కు 5 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ కోత ఉంటుందని గుర్తు చేశాడు.

దీని అదనంగా ఆర్టికల్‌ 16.11.2 ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌కు ఓ రేటింగ్‌ పాయింట్‌ కోత ఉంటుందని తెలిపాడు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నేరాన్ని అంగీకరించడంతో పాటు ప్రతిపాదిత శిక్షను స్వీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేదని రిచర్డ్‌సన్‌ ప్రకటించాడు.

కాగా, లార్డ్స్‌ టెస్ట్‌లో (మూడవది) భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించలేక బోల్తా పడింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. 

తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్‌ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement