గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్‌ ర్యాంకు! | Bangla Captain Mehidy Hasan Miraj Career Best Rank In ODI Bowling | Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: గొడవ పడిన బంగ్లా కెప్టెన్‌కు బెస్ట్‌ ర్యాంకు!

Mar 18 2026 3:43 PM | Updated on Mar 18 2026 3:53 PM

Bangla Captain Mehidy Hasan Miraj Career Best Rank In ODI Bowling

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం వన్డే, టీ20 ర్యాంకింగ్స​్‌ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్‌ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ నాన్ స్ట్రైక్ ఎండ్‌లో పాక్‌ బ్యాటర్‌ సల్మాన్‌ అఘాను రనౌట్‌ చేయడం వివాదం సృష్టించింది. 

అఘా కోపానికి కారణమై గొడవకు మూలకేంద్రంగా నిలవడమే గాక, బంగ్లాకు సిరీస్‌ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లా కెప్టెన్‌ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్థాన్‌ ఆటగాడు సల్మాన్‌ అఘా బ్యాటింగ్‌ విభాగంలో 9 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 

ఇక ఆల్‌రౌండర్ల విభాగంలోనూ సల్మాన్‌ అఘా ఉమ్మడిగా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్‌ కెప్టెన్‌ షహీన్‌ అఫ్రిది ఆల్‌రౌండర్ల కోటాలో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాటర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీమిండియా మళ్లీ వన్డేలు ఆడలేదు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ (791 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్‌ శర్మ 4వ స్థానంలో (748 పాయింట్లు), శుబ్‌మన్‌ గిల్‌ 5వ స్థానంలో (716 పాయింట్లు), కేఎల్‌ రాహుల్‌ (664 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. 

బౌలింగ్‌ విభాగంలో కుల్దీప్‌యాదవ్‌ ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ అక్షర్‌పటేల్‌ పదో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో భారత్‌ నుంచి అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌లు టాప్‌-10లో కొనసాగుతున్నారు. 

బౌలింగ్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి 2వ స్థానం నిలబెట్టుకోగా, బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకొని 702 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో మెరిసిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్‌ పాండ్యా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

చదవండి: ‘కాల్‌ మీ’.. లలిత్‌ మోదీ ఆసక్తికర పోస్టు!

Advertisement
 
Advertisement
Advertisement