
రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఆతిథ్య జట్టుపై ఆద్యంతం పైచేయి సాధించిన భారత్.. ఏకంగా 608 పరుగుల టార్గెట్ ఇచ్చింది. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Torphy)లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు బుధవారం మొదలైంది.
587 పరుగులు
ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు స్కోరు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భారీ ద్విశతకం (269) బాదగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. వీరితో పాటు వాషింగ్టన్ సుందర్ (42) కూడా రాణించాడు.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో కెప్టెన్ బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మూడో రోజు ఆటలో భాగంగా 407 పరుగులకు ఆలౌట్ అయింది.
హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) అద్భుత శతకాలతో 303 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో.. ఇంగ్లండ్ మేర స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగగా.. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని 180 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 64/1 (13)తో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టింది.
మరోసారి గిల్ దంచేశాడు
ఆట మొదలైన కాసేపటికే కరుణ్ నాయర్ (26) పెవిలియన్ చేరగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) అర్ధ శతకంతో రాణించాడు. ఇక గిల్ మరోసారి భారీ శతకం (161)తో దుమ్ములేపగా.. వికెట కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (65), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. నితీశ్ రెడ్డి (1) మరోసారి నిరాశపరచగా.. వాషింగ్టన్ సుందర్ జడేజాతో కలిసి 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.
గిల్ భారీ శతకం పూర్తైన కాసేపటికి భారత్ తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 83 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 180 పరుగులకు ఈ మేర (427) స్కోరు జతచేసి... ప్రత్యర్థికి భారీ లక్ష్యం విధించింది.
ఈ క్రమంలో శనివారం మూడో సెషన్ ఆఖర్లో లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 108 ఓవర్లలో పనిపూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఆఖరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌ను టీమిండియా ఆలౌట్ చేస్తుందా? లేదంటే.. డ్రా చేసుకునేందుకు స్టోక్స్ బృందం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న విషయం తేలుతుంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. మరో ఆటగాడి శతకం.. భారత్ భారీ స్కోరు