
ఇంగ్లండ్ గడ్డ మీద భారత యువ జట్టు అదరగొడుతోంది. ఆతిథ్య అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది.
వోర్సెస్టర్ వేదికగా శనివారం యూత్ వన్డేలో టాస్ ఓడిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే 14 బంతులు ఎదుర్కొన్ని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
దీంతో ఆదిలోనే వికెట్ తీసినందుకు ఇంగ్లండ్ సంబరాలు చేసుకోగా.. ఆ ఆనందాన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాసేపట్లోనే ఆవిరి చేశాడు. మరోసారి బ్యాట్‌తో వీర విహారం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ 143 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బౌలింగ్‌లో పదమూడు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండటం విశేషం.
ఇక వైభవ్ వరుసగా ఇలా నాలుగో మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడితే.. వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా కూడా శతకంతో చెలరేగాడు. 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది.
మిగతా వారిలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్ (0), హర్‌వన్ష్ పంగాలియా (0), కనిష్క్ చౌహాన్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఆర్‌ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) కూడా చేతులెత్తేయగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ రెండు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.
ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ అండర్-19 బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతరులలో బెన్ మేయ్స్, జేమ్స్ మింటో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే.. తొలి యూత్ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ( 48 (19) - 45 (34)- 86 (31))దే కీలక పాత్ర.
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు..
యూత్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడు వైభవ్. అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ షాంటో (2009లో 14 ఏళ్ల 241 రోజుల వయసులో శతకం) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు.