
ఇంగ్లండ్ సిరీస్‌తో సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన.. టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) వరుసగా విఫలమవుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతున్నాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టు తుదిజట్టులో భాగమైనకరుణ్.. రీఎంట్రీలో డకౌట్ అయ్యాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇరవై పరుగులు చేయగలిగాడు. అయితే, ఆ తర్వాత కూడా కరుణ్ నాయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడు చేసిన పరుగులు వరుసగా 31, 26. అయితే, ప్రఖ్యాత లార్డ్స్ మైదానం (Lord's Test)లో జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.
ఎట్టకేలకు కనీసం 40 పరుగుల మార్కు
లార్డ్స్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే, ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో కనీసం అర్ధ శతకమైనా చేయకుండానే కరుణ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా ఇంగ్లండ్‌లో ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కరుణ్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
తుదిజట్టు నుంచి తప్పించండి!
అయితే, యువ ఆటగాడు సాయి సుదర్శన్‌పై వేటు వేసి.. సీనియర్ అయిన కరుణ్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నా.. అతడి ఆట మెరుగుపడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాలుగో టెస్టు నుంచి అతడిని తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.
ఫెయిల్యూరే.. కానీ.. నాలుగో టెస్టులోనూ ఆడించండి
కరుణ్ నాయర్ విఫలమవుతున్న మాట వాస్తవమేనని.. అయితే, నాలుగో టెస్టులో కూడా అతడిని ఆడిస్తేనే బాగుంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు అంత గొప్పగా ఆడటం లేదు. అలా అని అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగానూ లేదు.
నిజానికి అతడి అదృష్టం అస్సలు బాలేదు. కరుణ్ ఇచ్చిన క్యాచ్‌లు సులువైనవి కాకపోయినా ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు అద్బుత రీతిలో వాటిని ఒడిసిపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఓలీ పోప్.. ఇప్పుడు రూట్.
కరుణ్ మరీ ఎక్కువగా పరుగులు చేయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించాలని అంటున్నారు.
అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడిని తదుపరి మ్యాచ్‌లో తప్పక ఆడించాలి. లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో గనుక కనీసం 30- 40 పరుగులు చేసినా అతడు నాలుగో టెస్టు ఆడేందుకు అర్హుడే అవుతాడు’’ అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఏదేమైనా కరుణ్ నాయర్ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే తన థర్టీస్, ఫార్టీస్‌ను ఎనభై, తొంభై, సెంచరీలుగా మలచాల్సి ఉంటుందన్నాడు ఆకాశ్. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 23- 27 మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి 145 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌తో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: MLC 2025: పొలార్డ్ విధ్వంసం... సూపర్ కింగ్స్ అవుట్... ఫైనల్లో ఎంఐ న్యూయార్క్