టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా భారత్- కివీస్ మధ్య శనివారం ఐదో టీ20కి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు స్థానిక ఆటగాడు సంజూ శాంసన్‌పైనే ఉన్నాయి.
గతేడాది కాలంలో టీమిండియా టీ20 ఓపెనర్‌గా రాణించిన సంజూ (Sanju Samson).. కివీస్‌తో గత నాలుగు మ్యాచ్‌లలో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు అతడు ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా మారింది.
మరోవైపు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రూపంలో సంజూకు పోటీ తీవ్రతరమైంది. కివీస్ ఆఖరి మ్యాచ్‌లోనూ ఈ కేరళ స్టార్ విఫలమైతే.. ప్రపంచకప్ టోర్నీలో వికెట్ కీపర్‌గా.. ఓపెనర్‌గా అతడి స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
మరింత ఒత్తిడి
"తిరువనంతపురంలో ఆఖరి మ్యాచ్. హోం బాయ్ సంజూ శాంసన్‌కు కూడా బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఈ మ్యాచ్‌లో అతడిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. గత కొన్నాళ్లుగా అతడు పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు.
ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడలేకపోతున్నాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. కాబట్టి కివీస్‌తో ఐదో టీ20లో సంజూ బాగానే ఆడినా.. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా అతడి స్థానం సుస్థిరం అని చెప్పలేము.
అలా అనుకుంటే తప్ప చోటు కష్టమే
ఒకవేళ టాపార్డర్‌లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు వద్దు అని మేనేజ్‌మెంట్ అనుకుంటే మాత్రమే సంజూ.. ఇషాన్‌ను దాటి తుదిజట్టులోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా గత నాలుగు మ్యాచ్‌లలో సంజూ చేసిన స్కోర్లు 10, 6, 0, 24.
ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. ఇషాన్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు.
కాగా తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని వరల్డ్‌కప్‌తో నేరుగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.
చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్


