మేము కాదు.. తనంతట తానే సెలక్ట్‌ చేసుకున్నాడు: అగార్కర్‌ | Ajit Agarkar says Vaibhav picked himself His Father Gets Emotional | Sakshi
Sakshi News home page

మేము కాదు.. తనంతట తానే సెలక్ట్‌ చేసుకున్నాడు: అగార్కర్‌

Jun 6 2026 4:22 PM | Updated on Jun 6 2026 5:15 PM

Ajit Agarkar says Vaibhav picked himself His Father Gets Emotional

ప్రధాని మోదీతో వైభవ్‌ కుటుంబం (ఫైల్‌ ఫొటో)

రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియాకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌లలో పర్యటించే భారత టీ20 జట్టుకు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు-2026 జట్టులోనూ అతడికి చోటు ఇచ్చారు.

తండ్రిగా నేను సాధించే గొప్ప రికార్డు అదే
ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ  భావోద్వేగానికి లోనయ్యారు. ఆజ్‌తక్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రికార్డుల గురించి వైభవ్‌ అస్సలు పట్టించుకోడు. ఇప్పుడిక టీమిండియా తరఫున మ్యాచ్‌లు గెలవడంపైనే అతడి దృష్టి ఉంటుంది.

వైభవ్‌ టీమిండియా గెలుపులో భాగమైతే తండ్రిగా నేను సాధించే అత్యంత గొప్ప రికార్డు అదే అవుతుంది’’ అని సంజీవ్‌ సూర్యవంశీ పేర్కొన్నారు. కాగా గతేడాది నుంచి ఐపీఎల్‌లో వైభవ్‌ సూర్యవంశీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

పరుగుల వరద
రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026లోనూ 36 బంతుల్లో సెంచరీతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించి.. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. అంతకు ముందు భారత్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలవడంలోనూ వైభవ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే.. వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయడానికి గల కారణాన్ని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ వెల్లడించాడు. ‘‘తనను కచ్చితంగా ఎంపిక చేయాల్సిందే అనేలా వైభవ్‌ తన ఆటతో ఒక రకంగా మమ్మల్ని బలవంతపెట్టాడు. పదిహేనేళ్ల పిల్లాడని మాకూ తెలుసు.

మేము కాదు.. తనంతట తానే సెలక్ట్‌ చేసుకున్నాడు
అయితే, చిన్న వయసులోనే రెండు ఐపీఎల్‌ సీజన్లలో వరుసగా సత్తా చాటడం మామూలు విషయం కాదు. కేవలం ఐపీఎల్‌ ఒక్కటనే కాదు.. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడి ప్రతిభను మాత్రమే మేము పరిగణనలోకి తీసుకున్నాము.

టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే అతడు తప్పక తన ఫామ్‌ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం. మున్ముందు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, వాటిని ఎదుర్కోగల సత్తా, టెంపర్‌మెంట్‌ వైభవ్‌కు ఉన్నాయి. ఒకరకంగా వైభవ్‌ తన ప్రదర్శనలతో తనకు తానే టీమిండియాకు ఎంపిక చేసుకున్నాడు’’ అని అగార్కర్‌ పేర్కొన్నాడు. 

కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్‌.. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ పదిహేనేళ్ల వయసుకే ఇప్పుడిలా టీమిండియాకు ఎంపికయ్యాడు.

చదవండి: అందుకే సూర్యను తప్పించాము: అగార్కర్‌

Advertisement
 
Advertisement
Advertisement