అందుకే సూర్యను తప్పించాం: అగార్కర్ | Ajit Agarkar explains why Shreyas Iyer replaced Suryakumar Yadav as Indias T20I captain | Sakshi
Sakshi News home page

అందుకే సూర్యను తప్పించాం.. అతడు మాత్రం అద్భుతం: అగార్కర్

Jun 6 2026 2:37 PM | Updated on Jun 6 2026 2:59 PM

Ajit Agarkar explains why Shreyas Iyer replaced Suryakumar Yadav as Indias T20I captain

అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. భారత టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. శ్రేయస్ గత మూడేళ్లగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. ఉన్నపళంగా అతడిని కెప్టెన్‌గా ప్రకటించడం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.

ఐపీఎల్‌-2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్‌ను అందించిన శ్రేయస్.. ఆ తర్వాత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా అతడు విజయవంతమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో సైతం ముంబై జట్టును నడిపించిన అనుభవం శ్రేయస్‌కు ఉంది.

ఒక్క కెప్టెన్సీలోనే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా కూడా ఈ ముంబైకర్ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టీ20 జట్టు బాధ్యతలను  అయ్యర్‌కు అప్పగించారు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కొత్త కెప్టెన్‌గా నియ‌మించ‌డంపై బీసీసీఐ చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ స్పందించాడు. శ్రేయ‌స్  ఒక లీడ‌ర్‌గానూ, బ్యాట‌ర్‌గానూ నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడ‌ని, అందుకే అత‌డికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని అగార్క‌ర్ తెలిపాడు.

"శ్రేయ‌స్ ఇప్ప‌టికే కెప్టెన్‌గా త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. అత‌డు గత కొన్నేళ్లుగా వేర్వేరు ఫ్రాంచైజీలను (ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్ కింగ్స్‌) సమర్థవంతంగా నడిపించడం మ‌నం చూశాము. అయ్య‌ర్‌ కెప్టెన్సీలోనే కేకేఆర్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌రంగా కూడా అత‌డు నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికయ్యే రేసులో అత‌డు చివ‌ర వ‌ర‌కు ఉన్నాడు.

కానీ టీమ్ కాంబినేష‌న్ కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేకపోయాము. భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక కెప్టెన్‌ను మార్చడం చాలా కష్టమైన నిర్ణయం. కానీ భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా సూర్యను తప్పించాల్సి వచ్చింది. రాబోయో రెండేళ్ల కాలం మాకు చాలా ముఖ్యం.

సూర్యకుమార్‌తో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాము. అన్ని విషయాలను అతడికి వివరించాము. అందుకు అతడు సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అన్ని రకాలగా శ్రేయస్‌ అర్హుడని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అజిత్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement