చిన్నకోడూరు(సిద్దిపేట): కళ్ల ముందు నారు మడులు ఎండుతుంటే గుండె మండుతున్న రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ జలసాధన పోరుకు శ్రీకారం చుట్టింది. చిన్నకోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు సుమారు 16 కి.మీటర్ల రెండు వేల మంది రైతులతో మహాపాదయాత్రకు పూనుకుంది. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరంకు గోదావరి జలాలు భారీగా వస్తున్నప్పటికీ సాంకేతిక సమస్యల సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తెలంగాణలోని ప్రాజెక్టులకు మళ్లించకుండా జాప్యం చేస్తుండటం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇక్కడి నీళ్లను అక్కడికి తరలిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మెడలు వంచి కాళేశ్వరం నీళ్లను తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు మళ్లించడమే లక్ష్యంగా ఈ మహాపాదయాత్రను ప్రారంభిస్తున్నారు. మాజీమంత్రి హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ శ్రేణులు వివిధ ప్రాంతాల నుంచి రైతులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నారు. ఉదయం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ప్రారంభమై మహాపాదయాత్ర సాయంత్రం రంగనాయక సాగర్ వద్దకు చేరేవిధంగా ప్రణాళిక రూపొందించారు. చివరగా రంగనాయసాగర్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టడమే లక్ష్యంగా జలసాధన పోరును ప్రారంభిస్తున్నారు.
కరువుకు ప్రధాన కారకుడు సీఎం
బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రస్తుత కరువుకు ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి జలాలు ఎత్తిపోసే అవకాశమున్నా సాగునీరివ్వకుండా సీఎం రైతు ద్రోహిగా మారారని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఆరోపించారు. రైతు మహాపాదయాత్ర సందర్భంగా మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్‌లతో కలసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లను సందర్శించి రైతు మహాపాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గోదావరి జలాలతో రిజర్వాయర్‌లు నింపాలని చేపట్టిన రైతు మహాపాదయత్రకు భారీగా రైతులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మేడిగడ్డ వద్ద భారీగా నీళ్లు సముద్రం పాలవుతుంటే ఆంధ్రా ప్రాంతానికి లబ్ధి చేకూరేవిధంగా సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. కన్నేపల్లి వద్ద పంప్‌హౌస్‌లో మోటార్లు ఆన్‌చేసే అవకాశమున్నా ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
● అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచిరంగనాయక సాగర్ వరకు పాదయాత్ర
● కాళేశ్వరం నీటి కోసం నేడు రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నిరసన
యాత్ర సాగుతుందిలా
అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ఉదయం 8 గంటలకు రైతు మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అల్లీపూర్ మీదుగా మైలారం, కమ్మర్లపల్లి, సలెంద్రి గ్రామాల మీదుగా చిన్నకోడూరుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పెద్దకోడూరుకు చేరుకుంటుంది. గ్రామంలోని రేణుకా మాత ఫంక్షన్ హాల్‌లో పాదయాత్రలో పాల్గొన్న వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మెట్టుబండలు మీదుగా రంగనాయక సాగర్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేశారు.


