రెండునెలలు కావస్తున్నా రిలీవ్ చేయని జీహెచ్‌ఎంసీ ముందుకు సాగని అభివృద్ధి పనులు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇదీ దుస్థితి
గజ్వేల్: మున్సిపల్ ఏఈ బదిలీ అంశం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారులను ఇరకాటంలో పడేసింది. జీహెచ్‌ఎంసీకి చెందిన ఏఈ ఇటీవల ఇక్కడికి బదిలీ అయ్యారు. అయితే రెండు నెలలు కావస్తున్నా.. ఆయనను అక్కడి ఉన్నతాధికారులు రిలీవ్ చేయడం లేదు. జీహెచ్‌ఎంసీకి ఉండే స్వయంప్రతిపత్తి, అధికారాల వల్ల వారిని ప్రశ్నించలేక, ఇక్కడ అభివృద్ధి పనులను వెళ్లదీసుకోలేక ఇక్కడి అధికారులు మింగలేక.. కక్కలేక అన్నట్టు నానాఇబ్బందులు పడుతున్నారు.
నెలలు కావస్తున్నా..
గజ్వేల్–ప్రజాపూర్ మున్సిపాలిటీలో ఏఈ బదిలీ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. కీలకమైన ఈ పోస్టు చాలా కాలంగా ఖాళీగానే ఉంది. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు.
లైట్ తీసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
తమ మున్సిపాలిటీకి బదిలీచేసిన ఏఈని రిలీవ్ చేయాలని అక్కడి అధికారులను అడగలేక గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు నానాయాతన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఇక్కడి మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌లు ఏఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ‘‘మీది లక్షలోపు జనాభా ఉన్నా మున్సిపాలిటీయే కదా.. ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోండి’’ అని సమాధానం దాటవేసినట్లు సమాచారం. ఇప్పుడు ఒక్కరు కూడా లేరని విన్న వించుకున్న వారు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అభివృద్ధి పనులకు ఆటంకం
స్థానిక మున్సిపాలిటీలో ఏఈ లేకపోవడం అభివృద్ధి పనులు ముందుకుసాగటం లేదు. ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఏఈ ఒకరు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారంలో ఒకటి రెండు రోజులు రావడమే గగనం. ఇక్కడ రూ.28కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం మున్సిపాలిటీకి ఇటీవల టెండర్లు పూర్తయిన రూ.18.7 కోట్ల యూఐడీఎఫ్(స్టేట్ అర్బ న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పనులు ప్రారంభం కావా ల్సి ఉండగా.. ఏఈ లేక ఆటంకం కలుగుతోంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి, హౌసింగ్ బోర్డు మైదానంలో చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధి పనులు, సంగాపూర్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్ పనులు, వరద కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ పనులు ఏఈ వస్తేకాని ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో పట్టణ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
మున్సిపల్ ఏఈ బదిలీ వ్యవహారంలో ఇరకాటం
ఇబ్బందులు పడుతున్నది నిజమే
జీహెచ్‌ఎంసీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చి ఏఈ ఇంకా విధుల్లో చేరకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమే. మున్సిపల్ ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని చెప్పారు. వేచి చూస్తున్నాం.
– గణేశ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్


