16 కిలో మీటర్ల రైతుల పాదయత్ర
కాళేశ్వరం జలాలు విడుదల చేయాలని డిమాండ్
పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు,
ఎమ్మెల్సీ దేశపతి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం సాంకేతిక కారణాలతో కన్నేపల్లి పంపుహౌస్ నుంచి మోటార్ల ద్వారా నీటిని సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ వరకు చేపట్టిన రైతు పాదయత్రకు భారీ స్పందన వచ్చింది. రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం ఉదయం 8 గంటలకు అల్లీపూర్ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు చేరుకున్నారు. డప్పు కళాకారులు, మహిళల నృత్యాలు, ఆటపాటలతో రైతుల పాదయాత్ర 16 కిలో మీటర్లు సాగింది. దారిపొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరువు సమయాల్లో ఆదుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో నీళ్లు ఉన్నా, మోటార్లు ఆన్ చేయకపోవండతో సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఖరీఫ్ పంట భవిష్యత్ ఆందోళన కలిగిస్తోందని, కన్నేపల్లి వద్ద ఉన్న నీళ్లను సిద్దిపేట ప్రాజెక్టులకు తరలించాలని నినదించారు. లేకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉదయం ప్రారంభమైన పాదయత్ర మధ్యాహ్నం 3 గంటలకు రంగనాయకసాగర్‌కు చేరుకుంది. పాదయత్రలో అన్నదాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపలి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారితోపాటు యాత్రలో కలిసి నడిశారు.
నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగునీరు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపిస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. రైతు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. ప్రస్తుతం ఏర్పడింది ప్రకృతి కరువు కాదని, రేవంత్‌రెడ్డి వికృత నిర్ణయం తీసుకువచ్చిన కరువు అని యద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డీ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా? లేదా ఎత్తి పారేయ్య మంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సీనియర్ నాయకులు పాల సాయిరాం, పాపయ్య, కనకరాజు, ఉమేశ్ చంద్ర, జంగిటి శ్రీనివాస్, సదానందం, సర్పంచ్‌లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
కర్షక బిడ్డ కేసీఆర్.. రైతుద్రోహి రేవంత్: హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నేపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా సాగునీరు ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి రైతుద్రోహిగా మారారని ఎమ్మెల్యే హరీవ్‌రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలంలో చేపట్టిన రైతుపాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.35 వేలకోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.18 వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతలను మోసం చేశారన్నారు. మూడు పంటలకు సంబంధించి రూ.19 వేల కోట్ల రైతుబంధును ఎగనామం పెట్టారని, కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతుల కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో చిన్నకోడూరు రైతుల స్ఫూర్తితో అన్ని మండలాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌పాలనకు విసిగిపోయి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు.
కదం తొక్కిన కర్షకులు


