టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ‘సమాంతర వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సర్వీస్ రూల్స్ వివాదం కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీఈఓ, ఎంఈఓ, డిప్యుటీ ఈఓ స్థాయి పోస్టులను సమాంతర వ్యవస్థ ద్వారా భర్తీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి అదనపు భారం పడదన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2004 పూర్వపు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను నెలాఖరుకల్లా విడుదల చేయాలని కోరారు. జీఓ 317 బాధితులకు జీఓ 190 ద్వారా సొంత జిల్లాలకు బదిలీలు కల్పించి స్పౌజ్ బదిలీల హామీని నెరవేర్చాలని, 5,700 కొత్త పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల మంజూరు, భాషా పండితులు, మిగిలిన పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చీఫ్ పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు కావలి అశోక్‌కుమార్, విష్ణుమూర్తి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి భైతి ఐలయ్య, సుంకిశీల ప్రభాకర్‌రావు, మహేందర్, సుశాంత్, రాజు నాయక్, గోవర్ధన్, శ్రీనివాస్‌రెడ్డి, తరాల పరమేశ్, ప్రనీద్, తుంగూరి సురేశ్, గుర్రం శ్రీనివాస్‌గౌడ్, అశోక్‌రావు పాల్గొన్నారు.


