జాప్యానికి సవాలక్ష కారణాలు డిజిటలైజ్ చేయాల్సినవి 64 వేలు నమోదు శాతం తక్కువే.. ముంచుకొస్తున్న గడువు
సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ బల్దియాల్లో మందకొడిగా నెమ్మదిగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ నమోదు శాతం చాలా తక్కువ.
సిద్దిపేటజోన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నాటికి 9,92,917 ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించి 8,22,164 పత్రాలను డిజిటలైజేషన్ చేయగా 82 శాతం నమోదు పూర్తయింది. మున్సిపాలిటీలకు సంబంధించి 64,402 పత్రాలు ఉండడం గమనార్హం. అత్యధికంగా సిద్దిపేట బల్దియాలో 36,849 పత్రాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా, అత్యల్పంగా హుస్నాబాద్‌లో 4,267 మిగిలి ఉన్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో 2,61,217ఓటర్లకుగాను 1,96, 815ఓటర్లకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగతా 64,402 పత్రాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ గడువును ఆగస్టు 3వ తేదీ నాటికి పొడిగించడంతో బల్దియాల్లో ఒక్క అడుగు ముందుకు పడితే వంద శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
విస్తృతంగా సమీక్షలు
ఆయా మున్సిపాలిటీల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగం విస్తృతంగా సమావేశాలు, సమీక్షలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ నుంచి మొదలు ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి వరకు అధికారులు సమీక్షించి బూత్ లెవల్ ఆఫీసర్లకు దిశానిర్ధేశం చేశారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తిచేసి శత శాతం డిజిటలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్య పరిష్కారానికి సూచనలు, సలహాలు అందించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కారణాలు అనేకం
ఆయా మున్సిపాలిటీల్లో ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ తక్కువగా కావడానికి సవాలక్ష కారణాలున్నాయి. ప్రధానంగా చనిపోయిన వారి సంఖ్య, ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు ఉన్నవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, స్వగ్రామంలో మ్యాపింగ్ చేసుకోవడం, జాబితాలో ఉన్న ఓటర్ల ఆచూకీ సమాచారం లేకపోవడం లాంటి కారణాలతో పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ వంద శాతంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఆగస్టు 3 గడువు ముంచుకు వస్తున్న నేపధ్యంలో బల్దియాల్లో మిగిలిపోయిన 64,402 ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ అనేది అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారిందనే చెప్పాలి.
బల్దియాల్లో మందకొడిగా ప్రక్రియ
నాలుగు మున్సిపాలిటీల్లో..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో శనివారం నాటికి 1,96,815 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది. సిద్దిపేట మున్సిపాలిటీలో 1,12,975 ఓటర్లకుగాను 76,126 డిజిటలైజేషన్ కాగా ఇంకా 36,849 చేయాల్సి ఉంది. అదేవిధంగా దుబ్బాకలో 49,272 ఓటర్లకు గాను 43,959 పత్రాలు డిజిటలైజేషన్ కాగా ఇంకా 5,313 చేయాల్సి ఉంది. మరోవైపు గజ్వేల్‌లో 79,811 ఓటర్లకు గాను 61,838 పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. మిగతా 17,973 చేయాల్సి ఉంది. అదేవిధంగా హుస్నాబాద్‌లో 19,159కిగాను 14,892 డిజిటలైజేషన్ కాగా 4,267 చేయాల్సి ఉంది. అత్యధికంగా దుబ్బాక మున్సిపాలిటీలో 89.22 శాతం డిజిటలైజేషన్ నమోదు కాగా అత్యల్పంగా సిద్దిపేట మున్సిపాలిటీలో 67.38 శాతం నమోదు కావడం విశేషం.


