సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంతుల సుధాకర్ సహాయంతో రూ.40 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, సమావేశ మందిరం, కిషన్ షెడ్లను వివేక్ ప్రారంభించారు. పాఠశాల డైనింగ్ హాల్, కిచెన్‌ను నిర్మించిన దాత దొంతుల సుధాకర్, వారి కుటుంబ సభ్యులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన చూస్తే పాఠశాల పనితీరు కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 50 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాలలద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక సాంకేతిక నైపుణ్యాల కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
సిద్దిపేటరూరల్: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశమున్నందున రైతులను తక్కువ నీరు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు సాగేలా ప్రోత్సహించాలని మంత్రి వివేక్ సూచించారు. కలెక్టరేట్‌లో వానాకాలం–2026 ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కంటెజెన్సీ ప్రణాళికపై కలెక్టర్‌తో కలిసి వ్యవసాయశాఖ, అనుంబంధ శాఖల ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి, సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న మంత్రి వివేక్‌కు కలెక్టర్ హైమావతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు, ఏఎంసీ చైర్మన్లు, ఆత్మకమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
జక్కాపూర్‌లో డైనింగ్ హాల్‌నుప్రారంభించిన మంత్రి వివేక్


