రాజీతో రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీతో రాజమార్గం

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

జిల్లా అదనపు న్యాయమూర్తి వై.జయప్రసాద్‌

సిద్దిపేటకమాన్‌: రాజీయే రాజమార్గమని, పెండింగ్‌లో ఉన్న నెగిషీయబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ (ఎన్‌ఐ) కేసులను పరిష్కరించుకోవడానికి లోక్‌ అదాలత్‌ సరైన వేదికని అదనపు జిల్లా న్యాయమూర్తి వై.జయప్రసాద్‌ తెలిపారు. సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టులో స్పెషల్‌ లోక్‌ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పలు చెక్‌బౌన్స్‌ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు న్యాయమూర్తి మాట్లాడుతూ..సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు ఒకేసారి లోక్‌ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు ఇరు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. స్పెషల్‌ లోక్‌ అదాలత్‌లో జిల్లాలో 09 బెంచెస్‌ ఏర్పాటు చేయగా..రూ.2,78,61,790 విలువైన 46 ఎన్‌ఐ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు.

‘గౌరవెల్లి’ కట్టపై ప్రత్యేక నిఘా

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టును సీపీ రష్మీ పెరుమాళ్‌ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు సామర్థ్యంతో పాటు ఎన్జీటీ కేసు తదితర వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో కూడా ప్రాజెక్టు కట్టపై ప్రత్యేక నిఘా ఉంచుతూ గస్తీ నిర్వహించాలని సూచించారు. సరదా కోసం ఎవరైనా ఈత కొట్టడానికి వస్తే రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు కట్టపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆకతాయిలు ధ్వంసం చేయకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు.

కాళేశ్వరంపై రాజకీయం వద్దు

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య

సిద్దిపేటఅర్బన్‌: రాష్ట్ర ప్రజలకు సాగు, తాగు నీరు అందించి కరువు నుంచి ప్రజలను కాపాడటానికి బదులు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న రాజకీయాలను మానుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య సూచించారు. సిద్దిపేటలో శనివారం జరిగిన సిద్దిపేట, మెదక్‌ జిల్లాల నిర్మాణ వర్క్‌షాప్‌కు హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చాయని, ఆనకట్ట దెబ్బతిన్నదని విమర్శలు చేసే బదులు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలకు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీరు నిల్వ చేయడం కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించకుండా విమర్శలు చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

టీచర్ల సమస్యలు

పరిష్కరించండి

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్‌

గజ్వేల్‌: కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌లో శనివారం వారి సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వలీ అహ్మద్‌ మాట్లాడుతూ..దశాబ్దాలుగా శ్రమదోపీడీకి గురవుతున్న కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్ష టీచర్లకు కనీస వేతన విధానాన్ని వర్తింపజేయాలన్నారు. రాష్ట్రంలో రెగ్యులర్‌ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే వీరికి హెల్త్‌ కార్డులు అందజేయాలని డిమాండ్‌ చేశారు. హాస్టళ్లల్లో కేర్‌ టేకర్‌లను నియమించి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ గజ్వేల్‌ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఆర్‌పీ ఉద్యోగుల ఎంఐఎస్‌ బాబు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement