సాక్షి, కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2.45 గంటల సమయంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే నివాసం తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎ. మధుసూధన్, బీవై. రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు.
చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి తెగబడితే బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్లు రువ్వడంతో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, గొడవకు ఎమ్మెల్యేనే కారణమంటూ సీఐ రవిశంకర్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని విమర్శించారు.
దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా, బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసినట్లు పోలీసు బలగాలు వ్యవహరించడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, తలుపులు పగులగొట్టి విరూపాక్షితో పాటు ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేసి చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ఎమ్మెల్యే నివాసంలోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను పోలీసులు తీసుకెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వాస్తవాలను బయటకు రానివ్వకుండా సాక్ష్యాలను మాయం చేసేందుకే హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిలోని దృశ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వంసం చేయకుండా భద్రపరచాలని, ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుబంధ విభాగంలా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బెదిరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు నాగరాజుతో పాటు నిందితులందరినీ అరెస్టు చేయాలని, సీఐ రవిశంకర్‌రెడ్డి ఏకపక్ష వ్యవహారశైలిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. చిప్పగిరిలో శాంతిభద్రతలను పరిరక్షించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.


