నల్లచెరువు: మండల పరిధిలోని దేవిరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాలకు పీఎంశ్రీ నిధులు, టైప్–4 నిధులు రూ.20 లక్షలకుపైగా మంజూరయ్యాయి. నిబంధనల మేరకు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను పేరెంట్స్ టీచర్స్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు కమిటీ ఆమోదం లేకుండానే పాఠశాలలోని కొందరి సాయంతో పనులు పూర్తి చేశారు. ఆదర్శ పాఠశాలలో పీఎం శ్రీ నిధులతో మరుగు దొడ్లు, నీటి కొళాయిలు, ఇతరాత్ర చిన్నచిన్న మరమ్మతులు చేయించాలి. కానీ అలాంటి పనులు చేయలేదు.
పీఎం శ్రీ నిధులు రూ. 4.75 లక్షలతో దేవిరెడ్డిపల్లిలోని ఆదర్శ పాఠశాలకు ఆట మైదానం, రూ. 70 వేలతో ర్యాంపు నిర్మాణం, రూ.లక్షతో పాఠశాల ఆవరణలో ఇంకుడుగుంత పనులు చేశారు. ఇందులో పాఠశాల ర్యాంపు మినహాయిస్తే ఇంకుడు గుంత, మైదానం పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులే చెబుతున్నారు. ఈ పనులకు రూ.2 లక్షలు కూడా ఎక్కువే అంటున్నారు.
ఆదర్శపాఠశాలకు పీఎం శ్రీ నిధులు టైప్–4 కింద రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలలో ల్యాబ్‌కు సంబంధించిన పనులు, స్మార్ట్ క్లాస్ రూములు, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సోలార్ ప్యానల్, వర్షపు నీటి సంరక్షణ పనులు చేయాల్సి ఉంది. అయితే పాఠశాలలో ఈ పనులు చేసిన ఆనవాళ్లే కనిపించడం లేదు.
పాఠశాలకు భారీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసినా... పాఠశాలలో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మైదానం మొత్తం రాళ్లతో నిండిపోయింది, పాఠశాలలో ఎటు చూసినా పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్నాయి. మరుగునీరు పాఠశాల ముందే పారతుండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన కొడుతోంది. వంట గది కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఆరుబయటే వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఇలాంటి అత్యవసర పనులు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంది. కానీ వాటిని పక్కన పెట్టి రికార్డుల్లో మాత్రం పనులు చేసినట్లు చూపి అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో చేసిన పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దేవిరెడ్డిపల్లి ఆదర్శ పాఠశాలకు మంజూరైన నిధులు స్వాహా
తూతూ మంత్రంగా పనులు చేసి నిధులు మింగేసిన టీడీపీ నాయకులు
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
ఎక్కడి సమస్యలు అక్కడే..
నాసిరకంగా పనులు..
టైప్–4 నిధులూ స్వాహా..


