ప్రశాంతి నిలయం: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, పారిశ్రామిక పార్కుల ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని ఆయా డివిజన్లలో చేపట్టిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పారిశ్రామిక వాడల ఫీజుబులిటీ నివేదికల వివరాలను ఆయా డివిజన్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాల్లో భూలభ్యతపై నివేదికలను అందజేయాలన్నారు. పారిశ్రామికాభివృద్ధికి భూకేటాయింపు ఎంతో కీలకమైన అంశమన్నారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తూ పరిహారాన్ని త్వరితగతిన అందేలా చూడాలని అధికారులకు సూచించారు. కోర్టు పరిధిలో లేని భూముల చెల్లింపుల ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ప్రమాద బాధితులకు
తక్షణ వైద్యం అందించాలి..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి పీఎం–రహత్ పథకం ద్వారా తక్షణం నగదు రహిత అత్యవసర వైద్య చికిత్స అందేలా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబ్బు కారణంగా ఏ ప్రమాద బాధితుడూ చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే పీఎం–రహత్ పథకం అమలు చేస్తున్నారన్నారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రిలో చేరిన బాధితుడికి ఈ పథకం కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత సేవలు అందిస్తారన్నారు. అర్హులకు చికిత్స అందించేందుకు నిరాకరించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ దేవి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధుసూదన్, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, డీపీఎంఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


