● మద్యం మత్తులోనే మదనపల్లె
వరకూ డ్రైవింగ్ చేసిన యువకుడు
కదిరి టౌన్: అర్ధరాత్రి ఊరికి వెళ్లేందుకు బస్సు లేకపోవడంతో ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ హైర్ బస్సును అపహరించాడు. ఈ ఘటన కదిరి పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురానికి చెందిన శివశంకర్ అటవీశాఖలో కాంట్రాక్ట్ ఫారెస్ట్ గార్డుగా పనిచేసేవాడు. అతని వ్యవహారశైలి వివాదాస్పదం కాగా అధికారులు తొలగించారు. అప్పటి నుంచి పూటుగా మద్యం సేవించి ఊళ్లు పట్టుకుని తిరిగేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన పెంపుడు కుక్కతో కలిసి రైలులో కదిరికి చేరుకున్నాడు. అక్కడ మద్యం తాగి అర్ధరాత్రివేళ బస్టాండుకు వచ్చాడు. బస్సు లేకపోవడంతో బస్టాండు బయటకు వెళ్లాడు. బాలికల కళాశాల ఎదురుగా ఆర్టీసీ అద్దె బస్సు కనిపించడంతో ఆ బస్సులోకి ఎక్కగా, తాళాలు కనిపించాయి. దీంతో బస్సును స్టార్ట్ చేసి పెంపుడు కుక్కతో కలిసి బస్సు నడుపుకుంటూ మదనపల్లె వైపు వెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామున మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న శివశంకర్ బస్సును వెనక్కుతీస్తూ గోడకు గుద్దాడు. అక్కడే ఉన్న పోలీసులు వెళ్లి చూడగా... శివశంకర్ మద్యం మత్తులో తూలుతూ కనిపించాడు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా... కదిరిలో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును తానే తీసుకువచ్చానని సమాధానం ఇచ్చాడు. దీంతో మదనపల్లి పోలీసులు కదిరి ఆర్టీసీ డిపో అధికారులకు, కదిరి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కదిరి పోలీసులు మదనపల్లెకు వెళ్లి శివశంకర్‌ను, అతను తీసుకువెళ్లిన బస్సును కదిరికి తీసుకువచ్చారు. అనంతరం బస్సు యజమాని అక్బర్‌సాహెబ్ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.


