నకిలీ బంగారు తాకట్టు కేసు దర్యాప్తు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారు తాకట్టు కేసు దర్యాప్తు ముమ్మరం

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

రోజూ ఆరా తీస్తున్న ఎస్పీ

ఎవరెవరి పేర్లు బయటికొస్తాయని సర్వత్రా చర్చ

మడకశిర: జిల్లాలో కలకలం సృష్టించిన నకిలీ బంగారు నగల తాకట్టు కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఎస్పీ సతీష్‌కుమార్‌ రోజూ పురోగతిని అడిగి తెలుసుకుంటున్నారు. మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌ నిందితుడు సుందరేశ్‌చారిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. పట్టణంలోని కెనరా బ్యాంకులో అప్రైజర్‌ సుందరేశ్‌చారి నకిలీ బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.70.66 లక్షల రుణం తీసుకున్న విషయం తెలిసిందే. గత నెల 25న బ్యాంకు ఆడిట్‌ అధికారుల తనిఖీలో బాగోతం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌ ఏజీఎం శ్రీనివాసులు సుందరేశ్‌చారితో పాటు మరో ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందరేశ్‌చారి పరారీ కాగా పోలీసులు గాలించి అతనిని పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సుందరేశ్‌చారిని రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎవరెవరు సహకరించారని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బ్యాంకు అధికారుల పాత్రపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నకిలీ బంగారు నగలను తాకట్టు పెట్టి తీసుకున్న నగదు విషయమై కూడా ప్రశ్నించినట్లు సమాచారం. కేసులో నిందితులైన ఏడుగురిని కూడా విచారించగా.. సుందరేశ్‌చారి నమ్మంచి మోసం చేశాడని లబోదిబోమన్నట్లు సమాచారం. మీ పేరు మీద బంగారు నగలను తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటానని చెప్పడంతో ఒప్పుకున్నామని, తమకు నకిలీ బాగోతం తెలియదని వాపోయినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో సుందరేశ్‌చారి ఎవరెవరి పేర్లు చెబుతాడోననే విషయం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ఎవరి పాత్ర ఉందో తేలుస్తాం

నకిలీ బంగారు నగల తాకట్టు కేసు దర్యాప్తు ముమ్మరం చేశాం. ఎవరెవరి పాత్ర ఉందో విచారణలో తేలుస్తాం. సుందరేశ్‌చారితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాం. త్వరలోనే కేసు విచారణ పూర్తి చేస్తాం. –రాజ్‌కుమార్‌,సీఐ, మడకశిర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement