
పవన్ కళ్యాణ్‌కు మొక్కను అందిస్తున్న దుర్గేష్, బండారు సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి, పల్లా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ల సీట్లు గల్లంతవుతున్నాయి. ఓ పక్క జనసేనతో పొత్తు, మరోపక్క చంద్రబాబు సమీకరణాల కారణంగా ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నేతలకు ఈసారి సీట్లు దక్కని పరిస్థితి నెలకొని, వారంతా గొల్లుమంటున్నారు. జనసేన, బీజేపీ పొత్తులో టీడీపీకి సుమారు 75 సీట్లు పోతాయని భావిస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా జరిగే సమీకరణాల్లో మరికొందరు సీనియర్లకు స్థానమే దక్కని పరిస్థితి నెలకొంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పటికీ ఖరారు కాలేదు. అయినప్పటికీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుసగా సీట్లు ఖరారు చేసేయడం టీడీపీ నేతలకు షాక్‌లా తగులుతోంది.
గతంలో చంద్రబాబు ఏకపక్షంగా రెండు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా, ఆ తర్వాత పవన్ కూడా ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు పవన్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పర్యటించి సీట్లు ఖరారు చేయడం టీడీపీ నేతలకు మింగుడు పడటంలేదు. సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన పవన్.. పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు జనసేన నేతలు వెల్లడించారు. దీంతో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక టీడీపీ ఇన్‌ఛార్జి పల్లా శ్రీనివాసరావు సీట్లు ఎగిరిపోయాయి. ఈ పరిణామంపై వారి వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.
మైలవరంలో మాజీ మంత్రి ఉమాకు షాక్
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు టీడీపీ అధినేత చంద్రబాబే గట్టి షాక్ ఇస్తున్నారు. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వైఎస్సార్‌సీపీ ఈసారి సీటు నిరాకరిస్తోంది. దీంతో కృష్ణప్రసాద్ టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయనకు మైలవరం స్థానాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండడంతో దేవినేని ఉమా కంగుతిన్నారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తనను కాదని తన ప్రత్యర్థికి సీటు ఇవ్వడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుచ్చయ్యకు నిరాశేనా!
ఆ తర్వాత రాజమండ్రి వచ్చిన పవన్.. రాజమండ్రి రూరల్ స్థానాన్ని కందుల దుర్గేష్‌కి కేటాయించినట్లు జనసేన నేతలు ప్రకటించారు. అది టీడీపీ సిట్టింగ్ సీటు. అక్కడి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇప్పటికే జనసేన నేతలపై బహిరంగంగానే మండిపడుతూ సీటు తనదేనని పదేపదే చెబుతున్నారు. పవన్ అక్కడ జనసేన అభ్యర్థిని ఖరారు చేయడంతో బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిటాల, జేసీ కుటుంబాలకు చంద్రబాబు దెబ్బ
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాలకు చంద్రబాబుకు గట్టి దెబ్బే కొట్టారు. కుటుంబంలో ఒకరికే సీటు ఇస్తానని చెప్పడంతో సునీత కుమారుడు శ్రీరామ్ ధర్మవరం స్థానాన్ని వదులకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా జేసీ దివాకర్, ప్రభాకర్ కుమారుల్లో ఒకరికే ఎంపీగానీ, ఎమ్మెల్యేగానీ ఇస్తామని చంద్రబాబు తేల్చేశారు.
అనకాపల్లిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికీ ఒక్క సీటే ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబాలన్నీ ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆళ్లగడ్డ సీటును మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇచ్చేందుకు బాబు నిరాకరించడంతో ఆమె కూడా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సీట్లు కోల్పోతున్న సీనియర్లందరూ చంద్రబాబుకు గట్టిగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తమకు సీట్లు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.