సేనాని @20ఏళ్ల పాలేరు.. జన సైనికులకు అరుపులే మిగిలాయా? | Janasena Supporters Emotional On Pawan Kalyan Comments | Sakshi
Sakshi News home page

సేనాని @20ఏళ్ల పాలేరు.. జన సైనికులకు అరుపులే మిగిలాయా?

Jun 25 2025 11:46 AM | Updated on Jun 25 2025 12:12 PM

Janasena Supporters Emotional On Pawan Kalyan Comments

శిఖరం ఒకరి ముందు తలవంచదు.. సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నిస్తాను అని చెప్పిన జనసేనని.. ఇప్పుడు ఇంకో 20 ఏళ్లు కూటమిని, ప్రభుత్వాన్ని మోయడానికి తనకి ఎలాంటి భేషజాలు, నామోషి, సిగ్గు లేదని తేల్చేశారు.

వైఎస్‌ జగన్ మీద కడుపుమంట  కావచ్చు.. అక్కసు కావచ్చు... ఈర్ష్య.. అసూయ కావచ్చు ఏదైనా కానీ జనసేనాని మాత్రం ఆజన్మాంతం చంద్రబాబుకు, లోకేష్‌కు సేవకుడిగా బతకడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు రాజకీయంగా ఎలాంటి విజన్, దార్శనికత.. ముందుచూపు, పార్టీ బలోపేతంపై నిబద్ధత లేదని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ ఇచ్చే మూటలు తీసుకుంటూ ఆ పార్టీని గెలిపించడానికి తాను రాజకీయంగా ఎంత నీచనికైనా దిగజారతానని తేల్చి చెప్పేశారు. దీంతో సీఎం అంటూ ఆయన సభల్లో గొంతు వాచిపోయేలా అరిచే ఆయన అనుచరులకు మాత్రం నైరాశ్యం మిగిలింది. నిన్ను గెలిపించడానికి.. సీఎంగా చూడడానికి మేము ఎన్నిసార్లు తెలుగుదేశం వారికి ఊడిగించేయాలి అంటూ వారు తమలో తాము కుమిలిపోతున్నారు.

వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఉన్నంతకాలం లేదా ఆయనకు ఆసక్తి ఉన్నంతకాలం బాబుకే ప్రాధాన్యం ఉంటుంది. అంతే తప్ప కొద్దిపాటి సీట్లు తీసుకుని పోటీ చేసే పవన్ కల్యాణ్‌కు ఎప్పటికీ ముఖ్యపాత్ర దక్కదు. ఢిల్లీ బీజేపీ పెద్దల ఒత్తిడి పుణ్యమా అని ఆయనకు డిప్యూటీ సీఎం అనే నామమాత్రపు పదవిని కట్టబెట్టి కాపుల్లో ఆయనకు ఉన్న పరపతి, ఓటు బ్యాంకును చంద్రబాబు విజయవంతంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం దక్కలేదని.. ప్రోటోకాల్ తగ్గిందని పవన్‌కు ఉన్నంత ఇంపార్టెన్స్ లేదని ఇబ్బంది పడుతున్న లోకేష్ అనధికారికంగా సీఎంగానే వ్యవహరిస్తూ అన్ని పనులు చేస్తున్నారు.

మరోవైపు, ఆయనకు ఎలాగైనా డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ నాయకుల నుంచి డిమాండ్లు కూడా తెర వెనుక నుంచి చేయిస్తున్నారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తే వచ్చే ఎలక్షన్ల నాటికి లోకేష్‌ను సీఎం అభ్యర్థిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు పల్లకి మోస్తున్న పవన్ వచ్చే ఎన్నికల్లో లోకేష్ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. అంటే లోకేష్ సీఎం కావడానికి కూడా పవన్ బేషరతుగా ఒప్పుకున్నట్లుగా లెక్క.. అంటే తండ్రి కొడుకులకు సేవ చేయడానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్లుగా ఇటు కాపు సామాజిక వర్గం ఆయన అభిమానులు సైతం భావిస్తున్నారు. చంద్రబాబు లేకపోతే ఆయన కొడుకు లోకేష్‌కు అయినా సరే ఆయన అడుగులకు మడుగులు నొక్కడానికి పవన్ రెడీగా ఉన్నట్లు మొన్నటి ప్రకటనలతో అర్థమైంది.

ఇంకో 20 ఏళ్ల పాటు తెలుగుదేశానికి తాను పాలేరుగా ఉంటానని ఆయన స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు, లోకేష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇవ్వడానికి అంగీకరించరు. ఎన్నటికీ పవన్ వారి తాబేదారిగా మాత్రమే ఉండాలి అన్నది వారి అభిమతం. నిన్ను సీఎంగా చూడాలని నేను తాపత్రయపడుతుంటే నువ్వు తెలుగుదేశానికి 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకుని మరి పాలేరుగా పనిచేయడానికి సిద్ధం అవుతున్నప్పుడు ఇక మేమేం చేస్తాం.. అంటూ జన సైనికులు లోలోన కుమిలిపోతున్నారు. 
-సిమ్మాదిరప్పన్న.

Advertisement
 
Advertisement
Advertisement