బాబు దురహంకారం..మరోసారి బహిర్గతం | Babu insulting comments on YSRCP candidate of Shinganamala | Sakshi
Sakshi News home page

బాబు దురహంకారం..మరోసారి బహిర్గతం

Mar 30 2024 4:51 AM | Updated on Mar 30 2024 4:51 AM

Babu insulting comments on YSRCP candidate of Shinganamala - Sakshi

పేదలు, దళితులంటే చంద్రబాబుకు చాలా అలుసు 

తరచూ వారిని హేళన చేస్తున్న బాబు 

ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ హేళన 

తోకలు కత్తిరిస్తా అంటూ నాయీ బ్రాహ్మణులపై చిందులు 

తాజాగా శింగనమల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కించపరుస్తూ వ్యాఖ్యలు 

సాక్షి, అమరావతి: నిలువెల్లా అగ్ర కుల దురహంకారాన్ని నింపుకొన్న టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ దానిని బహిర్గతం చేసుకొంటూ ఉంటారు. పేదలు, దళితులను హేళన చేస్తూ, అవమానపరుస్తుంటారు. బడుగు, బలహీన వర్గాలంటే ఆయన దృష్టిలో కేవలం ఓట్లు వేసి, తనలాంటి అగ్రకుల దురహంకారుల అడుగులకు మడుగులొత్తే వాళ్లే. తరచూ ఆయన మాటల్లో, చేతల్లోనే దీనిని బయటపెట్టుకుంటుంటారు. ఆయన చుట్టూ ఉండే వారు కూడా ఇదే మనస్తత్వంతో ఉంటారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నత హోదాలో ఉన్నప్పుడే  ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ దళితుల పట్ల అత్యంత హేయంగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది.

న్యాయం కోసం వచ్చిన నాయీ బ్రహ్మణులను ‘తోకలు కత్తిరిస్తా’ అంటూ కుల ఉన్మాదాన్ని చూపించారు. ఇలా పేదలు, దళితులను ఎప్పుడూ మనుషులుగా చూడని చంద్రబాబు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోసారి ఆ భావజాలాన్ని బహిరంగంగా బయటపెట్టుకున్నారు. తన అగ్ర కుల దురహంకారాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించి శింగనమల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వీరాంజనేయులును అవమానించారు. టిప్పర్‌ డ్రైవర్‌ ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంటూ పేదలు ఎన్నికల్లో పోటీకే పనికిరారనే రీతిలో వ్యాఖ్యలు చేశారు.

ఒక బహిరంగ సభలో ఓ దళిత ఎమ్మెల్యే అభ్యర్థిని కించపరిచేలా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి కావని, ఉద్దేశపూర్వకంగా చేసినవేనని దళిత సంఘాల నేతలు, పేదలు, మేధావులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. దళితులు, పేదలంటే జీర్ణించుకోలేని తనంతోనే ఆయన ఇలా మాట్లాడారని అంటున్నారు. ఎప్పుడూ కార్పొరేట్‌ రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఒక సామాన్యుడు రాజకీయంగా ఎదుగుతుంటే అస్సలు నచ్చదని విమర్శిస్తున్నారు. 

ఎన్ని జన్మలెత్తినా బాబుకిది ఒంటపట్టదు 
కష్టపడి రాజకీయాల్లో పైకి వచ్చిన వ్యక్తులకు మాత్రమే సామాన్యులు, దళితుల గురించి ఆలోచించే శక్తి ఉంటుందని, వెన్నుపోటు రాజకీయాలతో సీఎం కుర్చీ ఎక్కిన చంద్రబాబుకు ఎన్ని జన్మలెత్తిన ఆ జ్ఞానం ఒంటపట్టదని దళిత మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

40 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు నిరుద్యోగాన్ని పెంచిపోషించినందునే  ఎందరో దళిత బిడ్డలు టిప్పర్‌ డ్రైవర్లుగా, కూలీలుగా మిగిలిపోయారంటున్నారు. పార్టీలకతీతంగా దళితులు,  మే«­దా­వులు ఏకతాటిపైకి వచ్చి బాబు కుల దురహంకారాన్ని ఎండగడుతున్నారు. బాబే గొప్పగా పాలించి ఉంటే.. ఉన్నత చదువులు చదివిన వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా ఎందుకు పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిలదీస్తున్నారు. 

 డ్రైవర్లంటే చులకనా? 
మేం ఉపాధి కోసం డ్రైవింగ్‌ రంగాన్ని ఎంచుకొని కుటుంబాలను పోషిస్తున్నాం. అంత మాత్రాన చులకనగా మాట్లాడతారా? ఇందుకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సామాన్యులను సైతం అందలం ఎక్కిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది. దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేసి డ్రైవర్లను ఆదుకున్నారు. ఈ ఎన్నికల్లో మేమంతా వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటాం.  – సాకే లోకనాథ్‌ , టిప్పర్‌ డ్రైవర్, శింగనమల, అనంతపురం జిల్లా 

అవమానించడం బాధాకరం 
లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను అవమానించేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శింగనమలలో వ్యాఖ్యలు చేయడం బాధాకరం. వయసు మళ్లిన ఆయనకు ఎవరి గురించి ఏం మాట్లాడాలో తెలియక ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఆయనకు, ఆయన పార్టీకి సరైన శాస్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.  – కేతా శ్రీనివాసులురెడ్డి, లారీ డ్రైవర్, ముత్తుకూరు గ్రామం,  అనంతసాగరం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 

ఇందుకు చంద్రబాబే సిగ్గు పడాలి 
ఎస్సీ వర్గీయుడైన వీరాంజనేయులు ఎంఏ, బీఈడీ చేశారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాక, టిప్పర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. అందుకు చంద్రబాబే సిగ్గుపడాలి. ఉన్నత చదువులు చదివి, కష్టించి పని చేసుకుంటున్న వీరాంజనేయులును చట్ట సభలకు పంపాలన్న ఉన్నత లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ శింగనమల టికెట్‌ ఇచ్చారు. ఎవరి వృత్తి వారికి పవిత్రమైనది. డిగి్నటీ ఆఫ్‌ లేబర్‌ను అందరూ గౌరవించాలి. చంద్రబాబుకు ఆ మనసే లేదు.   – జొన్నలగడ్డ చంద్ర, క్యాబ్‌ డ్రైవర్, తెనాలి 

పేదల్ని గుర్తించిన నాయకుడు సీఎం జగన్‌ 
మాలాంటి పేదల్ని గుర్తించి, మాకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న నాయకుడు సీఎం జగన్‌. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా  డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు. చట్ట సభల్లో కూడా డ్రైవర్లకు స్థానం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. డ్రైవర్ల ప్రతినిధిగా సీఎం జగన్‌ గుర్తించిన వ్యక్తి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా నీచమైనవి. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతాం.      – ఉస్సేన్‌బాషా, ఆటో డ్రైవర్, పుట్టపర్తి  

దళితులకు బాబు వెన్నుపోటు 
చంద్రబాబు రాష్ట్ర నాయకుడిగా కాకుండా కుల నాయకుడిగా వ్యవహరిస్తున్నారంటూ దళిత సంఘాలు తూర్పారబడుతున్నాయి. దళితులను వేలిముద్ర గాళ్లు, డ్రైవర్లు అంటూ ఎగతాళిగా మాట్లాడి నీచ సంస్కృతికి తెగబడ్డారంటూ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో దళితులను, దళిత నాయకులను ఓట్ల కోసం వాడుకుని వదిలేసిన ఘనత చరిత్ర చంద్రబాబుదని, అందుకే దళితులెవ్వరూ ఆయన్ని నమ్మకపోవడంతో పనిగట్టుకుని వారినే కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఎందరో దళితులు రాష్ట్రానికి, దేశానికి మహోన్నత సేవలందిస్తే.. చంద్రబాబు చులకన భావంతో మాట్లాడటం సిగ్గుచేటని మేధావులు వాపోతున్నారు. ఇప్పటికే దళితులు, పేదలు చంద్రబాబు నయవంచక హామీలకు బలైపోయారని, మళ్లీమళ్లీ ఆ వర్గాలనే కించపరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. 

డ్రైవర్లంటే అంత చులకనా? 
చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలోని డ్రైవర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టిప్పర్‌ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు దేనికీ పనికిరారనట్టుగా చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని రాష్ట్రవ్యాప్తంగా డ్రైవింగ్‌ వృత్తితో జీవిస్తున్న వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. లక్షలాది మంది డ్రైవర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ప్రజా రవాణా­లో డ్రైవర్‌ వ్యవస్థ అత్యంత కీలకమైదని, తమను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డ్రైవర్‌ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement