చేతిలో ఏటీఎం కార్డు.. మొబైల్ స్క్రీన్‌పై తెల్లటి పొడి.. కరెన్సీ నోటు.. ఆ పక్కనే నవ్వులు చిందిస్తున్న అమ్మాయి.. ఇదంతా చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టీవీకే ఎమ్మెల్యే, తమిళనాడు మంత్రి డీ శరత్‌కుమార్‌కు డ్రగ్స్ అలవాటు ఉందా? అంటూ పలువురు పశ్నిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో స్వయంగా సీఎం విజయ్ పాల్గొన్న వేళ.. ఈ వీడియో బయటకు రావడం తమిళనాట కలకలం రేపింది.
తమిళనాడు మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్‌కుమార్‌కు సంబంధించిన ఓ వ్యక్తిగత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో మంత్రి ఏటీఎం కార్డుతో మొబైల్ స్క్రీన్‌పై తెల్లటి పొడి వంటి పదార్థాన్ని నలిపినట్లు కనిపిస్తోంది. పక్కనే రూ.500 నోటు కూడా ఉండటంతో పలువురు సోషల్ మీడియా వినియోగదారులు అది మాదకద్రవ్యమేనని ఆరోపించారు. కొందరు ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోపై శరత్ వివరణ ఇచ్చుకున్నారు.
ఆ వీడియో పాతదని.. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తీసిందని.. దానిని తాను ఇన్‌స్టాగ్రామ్ 'క్లోజ్ ఫ్రెండ్స్' స్టోరీలో షేర్ చేశానని.. అది ఇప్పుడు వైరల్ అవుతోందని అన్నారాయన.
Old video of TVK Minister Sarathkumar is viral online where he was caught using drugs during IPL.
He gave an explanation that it was some tablet/ milk power for his baby. But where is the baby and wife here?
(1/n)pic.twitter.com/T6LXICsYUp— GeoMedicus (@dr_harish_s) June 26, 2026
ఇక డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన శరత్‌కుమార్.. భార్య, చిన్న కుమార్తెతో కలిసి వీడియో విడుదల చేశారు. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని.. అప్పటికి తన కుమార్తెకు ఏడాదిన్నర వయసు మాత్రమేనని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి మాత్ర మింగకపోవడంతో, వైద్యుడి సూచన మేరకు మాత్రను పొడిచేసి ద్రవంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. వీడియోలో కనిపిస్తున్నది అదే మాత్ర అని, దీనిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Did a #TamilNadu minister really get caught handling drugs during an #IPL match? An old video of Tamil Nadu Minister for Human Resources Management D. Sarathkumar has resurfaced online, triggering drug-related allegations on social media.
The clip shows the minister using a bank… pic.twitter.com/gBZ7aKR2lX— The New Indian Express (@NewIndianXpress) June 26, 2026
అయితే ఈ వివరణతో వివాదం ఆగలేదు. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై స్పందిస్తూ.. వీడియోలో కనిపించిన తీరు డ్రగ్స్ తీసుకునే విధానాన్ని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని.. అలాంటి సమయంలో మంత్రిపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
ఈ వివాదంపై బీజేపీ కూడా స్పందించింది. మంత్రి శరత్‌కుమార్ వివరణ ఇచ్చినప్పటికీ, వైరల్ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాలని బీజేపీ నేత నారాయణన్ తిరుపతి డిమాండ్ చేశారు.
గత నెలలోనే మంత్రి పదవి చేపట్టిన శరత్‌కుమార్‌కు ఈ వివాదం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ వీడియో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వీడియోలో కనిపించేది నిజంగా డ్రగ్సా? లేక మంత్రి చెబుతున్నట్లుగా చిన్నారికి ఇచ్చే మందేనా? అనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.


