విజయ్‌తో భేటీ.. 24 గంటల్లోనే సీన్‌ రివర్స్‌! | Tamil Nadu Politics Heat Up As Vaiko’s MDMK Exit Backfires With Mass Defections To DMK, Watch Video Inside | Sakshi
Sakshi News home page

విజయ్‌తో భేటీ.. 24 గంటల్లోనే సీన్‌ రివర్స్‌!

Jun 29 2026 8:25 AM | Updated on Jun 29 2026 10:33 AM

Vijay Link DMK Exit Then Came Vaikos Biggest Shock

తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. విజయ్‌ ఫ్యాక్టర్‌తో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా.. ప్రతిపక్ష డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌లో చీలికలు కనిపిస్తున్నాయి. ఆఖరికి స్టాలిన్‌తో ఎనిమిదేళ్లకు పైగా కలిసి నడిచిన ఎండీఎంకే కూడా కూటమికి గుడ్‌బై చెప్పింది. పైగా రాజకీయ ప్రత్యర్థిని ఆకాశానికెత్తడంతోనే ఆగిపోకుండా.. సంచలన ఆరోపణలు చేస్తూ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇదంతా స్టాలిన్‌కు బిగ్‌ షాక్‌ అని అంతా భావించారు. కానీ..

ఇక్కడే తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించనిది జరిగింది. పొలిటికల్‌ గేమ్‌లో పావులు తారుమారు అయ్యాయి. డీఎంకేకు షాక్‌ ఇవ్వాలనుకున్న వైకోకే.. 24 గంటలు గడవక ముందే పెద్ద షాక్‌ తగిలింది. ఆయన పార్టీకి చెందిన 150 మందికిపైగా కీలక నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం ఎండీఎంకే అధినేతను రాజకీయంగా ఇరకాటంలో పడేసినట్లయ్యింది.

చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం 'అన్నా అరివాలయం'లో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి. శివగంగా, తిరువల్లూర్‌, విరుధునగర్‌, తిరుపూర్‌ జిల్లాలకు చెందిన రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, న్యాయవాదులు, విద్యార్థి విభాగ నేతలు డీఎంకే కండువా కప్పుకున్నారు. తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ లా యూనివర్సిటీకి చెందిన సుమారు 40 మంది విద్యార్థులు కూడా డీఎంకేలో చేరడం విశేషం.

1994లో డీఎంకేతో విభేదాల కారణంగా వైకో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండీఎంకే)ను స్థాపించారు. ఆ తర్వాత అనేక రాజకీయ ఒడిదొడుకుల మధ్య గత ఎనిమిదేళ్లుగా.. డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే కొనసాగారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎస్పీఏ కూటమి నుంచే పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. అందులో మూడు స్థానాల్లో డీఎంకే ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు గుర్తుపై అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం. 

అయితే ఎన్నికల ప్రచారం సమయంలో వైకో.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ను పలుమార్లు ప్రశంసించారు. ఆయన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ.. ప్రత్యామ్నాయ రాజకీయాలపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే టీవీకే ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు గుప్పించడం, ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై వైకో ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం. ఇదేదీ చాలదన్నట్లు.. విజయ్‌తో భేటీ కావడం కూడా తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 

తదనంతరం జరిగిన ఎండీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజా తీర్పుకు విరుద్ధంగా తెరవెనుక రాజకీయ ఒప్పందాలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ కారణంగానే పొత్తు నుంచి బయటకు వస్తున్నట్లు తీర్మానంలో పేర్కొంది. ఎన్నికలు సమీపించినప్పుడు కొత్త రాజకీయ పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించింది. అయితే విజయ్‌ నేతృత్వంలోని టీవీకేతోనే ఎండీఎంకే పొత్తు ఉండొచ్చన్న ఊహాగానాలు తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.

వైకో కూటమి నుంచి వైదొలగడం డీఎంకేకు రాజకీయ ఎదురుదెబ్బగా మారుతుందని తొలుత భావించినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మాత్రం పూర్తిగా భిన్న చిత్రాన్ని చూపించాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై స్టాలిన్‌ మౌనం పాటించడం కూడా చర్చనీయాంశమైంది. స్పందనలతో కాకుండా.. భారీ చేరికలతోనే రాజకీయంగా సమాధానం ఇచ్చారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్‌ ఫ్యాక్టర్‌, వైకో ఎత్తుగడలు, ఎండీఎంకేలో చోటుచేసుకున్న భారీ వలసలు... ఇవన్నీ కలిసి తమిళనాడు రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement