భారత్–అమెరికా సంబంధాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఆ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (USISPF) లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ట్రంప్-మోదీ స్నేహంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్‌సీ ఈవెంట్ సందర్భంగా ట్రంప్‌తో కలిసి బ్యాక్‌స్టేజ్‌లో ఉన్నప్పుడు.. ఒక్కసారిగా "ప్రధాని మోదీకి ఫోన్ చేద్దాం" అని ట్రంప్ చెప్పారన్నారు. అయితే.. అప్పటికే భారత్‌లో ఉదయం 6 గంటలు అవుతుందని.. బాగా వేకువజామున అని తాను చెప్పగా, ట్రంప్ వెంటనే..
‘‘ఆయన(మోదీ) ఈపాటికే లేచి ఉంటారు. ఆయన నాలాగే. నిద్ర తక్కువే (He's like me). సరిగా నిద్రపోరు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చినట్లు గోర్ వివరించారు. అయితే ఆ రోజు కాల్ చేయకపోయినా.. మరుసటి రోజు ఇద్దరూ మాట్లాడుకున్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనలో ప్రధాన విషయం ఫోన్ కాల్ కాదని.. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహబంధమేనని గోర్ వ్యాఖ్యానించారు.
"ఎవరైనా నిజమైన స్నేహితులైతే ప్రతి విషయం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిజంగానే ప్రధాని మోదీని తన స్నేహితుడిగా భావిస్తారు" అని ఆయన అన్నారు.

భారత్‌తో బంధానికి ట్రంప్ ప్రాధాన్యం
భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ట్రంప్ ఉన్నారని సెర్గియో గోర్ స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్‌లో ట్రంప్‌తో దాదాపు రెండు గంటలపాటు సమావేశమైన సందర్భంగా కూడా ఆయన భారత్ గురించి ఎంతో అభిమానంతో మాట్లాడారని చెప్పారు. ట్రంప్‌కు తన గత భారత పర్యటన ఇప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని, భారత్‌పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని గోర్ తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా ట్రంప్ భారత్‌ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది ట్రంప్ భారత్‌లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే.
మొదటి టర్మ్‌లోనే బలపడిన స్నేహం
ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలోనే మోదీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమం, భారత్‌లో నిర్వహించిన 'నమస్తే ట్రంప్' సభలు ఆ ఇద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచాయి. అప్పటి నుంచి రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి కీలక రంగాల్లో రెండు దేశాల సహకారం మరింత బలపడిందని అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్తుపై ఆశలు
వచ్చే రెండేళ్లు భారత్-అమెరికా సంబంధాలకు అత్యంత కీలకమని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతిక రంగాల్లో మరింత స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ద్వైపాక్షిక సంబంధాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు.


