జూన్ 21న జరగనున్న పరీక్షపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
విచారణను జస్టిస్ నరసింహ ధర్మాసనానికి బదిలీ చేసిన కోర్టు
కొందరి తప్పులకు లక్షలాది మందికి శిక్ష వేస్తారా అని ప్రశ్నించిన పిటిషనర్
సాక్షి , న్యూఢిల్లీ: నీట్ యూజీ–2026 పరీక్షను రద్దు చేసి దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష (రీ–ఎగ్జామ్) నిర్వహించాలన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జూన్ 21న జరగాల్సిన రీ–ఎగ్జామ్ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు ఇచ్చేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టింది.
అయితే, ఈ వ్యవహారంపై ధర్మా సనం ఎలాంటి లోతైన వ్యాఖ్యలు చేయకుండా, కేసును బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. నీట్ వివాదానికి సంబంధించిన ఇతర కేసులను ఇప్పటికే విచారిస్తున్న జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాస నానికే ఈ పిటిషన్‌ను బదిలీచేస్తున్నట్లు సీజేఐ సారథ్యంలోని ధర్మా సనం వివరించింది. వేసవి సెలవుల అనంతరం జూలై 13 నుంచి సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహ ధర్మాసనం అప్పుడు ఈ కేసును విచారించనుందని స్పష్టం చేసింది.
ఏ తప్పూ చేయని విద్యార్థులను బలిచేస్తారా?
ఈ కేసులో పిటిషనర్ తన వాదనలు విన్పించారు. మే 3న జరిగిన నీట్–2026 పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల కు మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న ఎన్‌టీఏ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆరోగ్య సేవల విభాగం మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగళా కోహ్లీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కొందరు వ్యక్తులు, నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో జరిగిన అవకతవకలకు ఏ తప్పూ చేయని లక్షలాది మంది విద్యార్థులను బలిచేయడం అన్యాయమని పిటిషనర్ వాదించారు. ‘‘పేపర్ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలే కానీ, సంస్థాగత వైఫల్యాలకు విద్యార్థుల రాజ్యాంగ హక్కులను కాలరాయడం సరికాదు. మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(జీ), 21లకు విరుద్ధం, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం’’ అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు.
ఎన్‌టీఏ ప్రక్షాళనకు నిపుణుల కమిటీ వేయాలి
జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణలో సమూల ప్రక్షాళన, సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని పిటి షనర్ కోర్టును కోరారు. ‘ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ క్వశ్చన్ డెలివరీ’, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఏఐ మాని టరింగ్ లాంటి పటిష్టమైన సాంకేతికతతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఎన్‌టీఏలో ఉన్న లోపాలను అధ్యయనం చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు.


