‘భీమ్‌రావు కాంబ్లేను ఉరితీయండి’.. తీర్పు వెలువరించిన కోర్టు | Pune court awards death penalty to 65 year old in Nasrapur case | Sakshi
Sakshi News home page

‘భీమ్‌రావు కాంబ్లేను ఉరితీయండి’.. తీర్పు వెలువరించిన కోర్టు

Jun 29 2026 2:43 PM | Updated on Jun 29 2026 3:59 PM

Pune court awards death penalty to 65 year old in Nasrapur case

ముంబై: హత్యకేసులో పూణే జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పసిగుడ్డుపై అమానుషానికి పాల్పడిన నిందితుడు భీమ్‌రావు కాంబ్లేకు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా అరుదైన కేసుల్లో ఒకటిగా.. అత్యంత హేయమైన నేరంగా పరిగణిస్తూ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది.   

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని పూణే జిల్లా, భోర్ తాలూకా పరిధిలోని నస్రాపూర్ గ్రామంలో ఈ ఏడాది మే 1న జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూడున్నరేళ్ల పసికందును నిందితుడు కాంబ్లే అపహరించి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. ఈ దారుణంపై మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరింది.

ఈ ఘటనపై పూణే జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో నిందితుడు నేరం చేసినట్లు తేలడంతో, అతనిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పూణే రూరల్ పోలీస్ విభాగం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ గిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఎస్పీ సందీప్ సింగ్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు దర్యాప్తు చేపట్టి, కేవలం 15 రోజుల్లోనే 1200 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో 55 మంది సాక్షులు, కీలక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, మెడికల్ పరీక్షా నివేదికలు, ఫోరెన్సిక్ విశ్లేషణ, మొబైల్ లొకేషన్ డేటా, కాల్ రికార్డులు వంటి సాంకేతిక ఆధారాలను పొందుపరిచారు.

ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. ఘటన జరిగిన 55 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ప్రాసిక్యూషన్ పలు వారాల పాటు వాదనలు వినిపించగా, డిఫెన్స్ తరపు న్యాయవాదులు ఆరోపణలను వ్యతిరేకించారు. అయితే సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు భావించింది.

జూన్ 25న నిందితుడిని దోషిగా నిర్ధారించిన తర్వాత, న్యాయమూర్తి శిక్షపై తీర్పును రిజర్వ్ చేసి, ఆ తర్వాతి సోమవారం మరణశిక్షను విధించారు. శిక్షను ఖరారు చేసే సమయంలో న్యాయమూర్తి నేర స్వభావం, బాధితురాలి వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

తీర్పు వెలువడినప్పుడు బాధితురాలి కుటుంబం కోర్టులో హాజరైంది. డిఫెన్స్ తరఫున ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. పోక్సో చట్టం కింద మైనర్లకు సంబంధించిన కేసులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ఈ కేసు రికార్డు సమయంలో ముగిసింది. నిందితుడు అప్పీల్ దాఖలు చేస్తే, బాంబే హైకోర్టు ఈ తీర్పును సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, కాంబ్లే జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.

ఈ కేసు విచారణ అత్యంత వేగంగా పూర్తయిన న్యాయచరిత్రలో ఒకటిగా నిలిచింది. సున్నితమైన కేసు కావడంతో నిందితుణ్ని కెమెరా ద్వారా విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement