breaking news
Pune court
-
పుణే కేతన్ కేసులో బిగ్ ట్విస్ట్!.. తెరపైకి లై డిటెక్టర్ టెస్ట్
పుణే: దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసిన కేతన్ అగర్వాల్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలు సియాపై లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులు గురువారం పుణే కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో నిజానిజాలు వెలికితీయడానికి ఈ పరీక్ష అవసరమని వారు వాదించినట్లు సమాచారం.కేతన్‌ను లోహన్‌గఢ్ కోట వద్ద ఎవరు లోయలోకి తోసి చంపారనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదని పోలీసులు కోర్టుకు నివేదించారు. తొలుత సియా ప్రియుడు చేతన్ తోశాడని.. తర్వాత సియానే తోసిందని.. ఆపై చేతన్ స్నేహితుడి ప్రమేయం ఉందని.. ఇలా రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఎవరు తోశారో కచ్చితంగా చెప్పగలిగే ఆధారం మాత్రం లభించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో నిందితులు మౌనం వహిస్తున్నారని వివరించారు. ఈ తరుణంలో లై డిటెక్టర్ పరీక్ష ఒక్కటే మార్గమని కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సియా తరఫు న్యాయవాది విపుల్ దుషింగ్ మాత్రం లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టు అనుమతి మాత్రమే సరిపోదని, నిందితురాలి సమ్మతి కూడా తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అంతేకాదు, పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితాలను కోర్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిగణించదని, అవి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త ఆధారాలు, లీడ్స్ సేకరించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.కేసు ఇప్పటికే మిస్టరీగా మారిన నేపథ్యంలో, ఎవరి పాత్రపై కూడా ఇప్పటివరకు తేలికైన ఆధారాలు లభించకపోవడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. కోర్టు ఈ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ, పుణె రూరల్ పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వివాహం విషయంలో అసంతృప్తిగా ఉన్న కేతన్‌ను ఆయన కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫోటో షూట్ సమయంలో కేతన్‌ను 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు అంతకు ముందు.. జూన్ 14న ఇదే కోట వద్ద జరిగిన మరో ప్రయత్నం విఫలమైనట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.దర్యాప్తులో కీలకంగా, 33 డిగ్రీల ఎండలోనూ చేతన్ చౌదరి హుడీ ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జనవరి నుంచి జూన్ మధ్యలో సియా–చేతన్ మధ్య 2,000కుపైగా కాల్స్ జరిగినట్లు కాల్ డేటా విశ్లేషణలో బయటపడింది. కేతన్ మరణం అనంతరం అతని మొబైల్ ఫోన్ కొంతసేపు సియా వద్దే ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాల నేపథ్యంలో జూన్ 23న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కేసు అత్యంత కీలక దశలో ఉండగా, దీనిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు ప్రభుత్వం అప్పగించింది. ఈ కేసులో.. కేతన్ తరఫున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్స్ 103 (హత్య), 61 (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు కాగా, నిందితుల పోలీస్ కస్టడీని కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 28న సియా సమక్షంలో డమ్మీ సాయంతో ఘటన పునర్నిర్మాణం (Crime Scene Recreation) నిర్వహించారు. జూలై 1న చేతన్ చౌదరిని నేరుగా లోహగఢ్ కోటకు తీసుకెళ్లి మరోసారి సీన్ రీక్రియేషన్ చేసినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో గైట్ అనాలిసిస్, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, అలాగే డిలీట్ చేసిన డేటా రికవరీపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ ఘటనకు ముందు.. మరో కోట వద్ద ఈ ఇద్దరూ కేతన్‌ను ఎలా తోసి చంపాలో రిహార్సల్స్ సైతం నిర్వహించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో.. లై-డిటెక్టర్ పరీక్షపై కోర్టు నిర్ణయం దర్యాప్తులో తదుపరి కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
‘భీమ్రావు కాంబ్లేను ఉరితీయండి’.. తీర్పు వెలువరించిన కోర్టు
ముంబై: హత్యకేసులో పూణే జిల్లా ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పసిగుడ్డుపై అమానుషానికి పాల్పడిన నిందితుడు భీమ్రావు కాంబ్లేకు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణ సందర్భంగా అరుదైన కేసుల్లో ఒకటిగా.. అత్యంత హేయమైన నేరంగా పరిగణిస్తూ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని పూణే జిల్లా, భోర్ తాలూకా పరిధిలోని నస్రాపూర్ గ్రామంలో ఈ ఏడాది మే 1న జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూడున్నరేళ్ల పసికందును నిందితుడు కాంబ్లే అపహరించి, అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. ఈ దారుణంపై మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం నిందితుడికి ఉరిశిక్ష విధించాలని కోరింది.ఈ ఘటనపై పూణే జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో నిందితుడు నేరం చేసినట్లు తేలడంతో, అతనిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పూణే రూరల్ పోలీస్ విభాగం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ గిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఎస్పీ సందీప్ సింగ్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు దర్యాప్తు చేపట్టి, కేవలం 15 రోజుల్లోనే 1200 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఇందులో 55 మంది సాక్షులు, కీలక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, మెడికల్ పరీక్షా నివేదికలు, ఫోరెన్సిక్ విశ్లేషణ, మొబైల్ లొకేషన్ డేటా, కాల్ రికార్డులు వంటి సాంకేతిక ఆధారాలను పొందుపరిచారు.ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించింది. ఘటన జరిగిన 55 రోజుల్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. ప్రాసిక్యూషన్ పలు వారాల పాటు వాదనలు వినిపించగా, డిఫెన్స్ తరపు న్యాయవాదులు ఆరోపణలను వ్యతిరేకించారు. అయితే సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు భావించింది.జూన్ 25న నిందితుడిని దోషిగా నిర్ధారించిన తర్వాత, న్యాయమూర్తి శిక్షపై తీర్పును రిజర్వ్ చేసి, ఆ తర్వాతి సోమవారం మరణశిక్షను విధించారు. శిక్షను ఖరారు చేసే సమయంలో న్యాయమూర్తి నేర స్వభావం, బాధితురాలి వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.తీర్పు వెలువడినప్పుడు బాధితురాలి కుటుంబం కోర్టులో హాజరైంది. డిఫెన్స్ తరఫున ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. పోక్సో చట్టం కింద మైనర్లకు సంబంధించిన కేసులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ, ఈ కేసు రికార్డు సమయంలో ముగిసింది. నిందితుడు అప్పీల్ దాఖలు చేస్తే, బాంబే హైకోర్టు ఈ తీర్పును సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, కాంబ్లే జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు.ఈ కేసు విచారణ అత్యంత వేగంగా పూర్తయిన న్యాయచరిత్రలో ఒకటిగా నిలిచింది. సున్నితమైన కేసు కావడంతో నిందితుణ్ని కెమెరా ద్వారా విచారణ చేపట్టారు. -
నా ప్రాణాలకు ముప్పు
న్యూఢిల్లీ: హిందూ జాతీయవాది వినాయక్ దామోదర్ సావర్కార్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. సావర్కర్ పరువుకు నష్టం వాటిల్లిందంటూ తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే కుటుంబ సభ్యుడేనని తెలియజేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే బంధువు తనపై ఫిర్యాదు చేయడం చూస్తే తనకు ప్రాణాపాయం ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ బుధవారం పుణే కోర్టుకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. సావర్కర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు ఇటీవల తాను లేవనెత్తిన రాజకీయ అంశాల దృష్ట్యా తన భద్రత ప్రమాదంలో పడినట్లు భావిస్తున్నానని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కుటుంబం గతంలో హింసాకాండకు పాల్పడినట్లు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు దిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. ఆ చరిత్ర మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు. మహత్మా గాంధీ హత్య లాంటిది మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఓట్ల చోరీ బాగోతాన్ని బయటపెట్టినందుకు ఇద్దరు బీజేపీ నాయకుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని రాహల్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ, తర్వీందర్‌సింగ్ మార్వా తనను బహిరంగంగా బెదిరించారని చెప్పారు. ‘దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ’ అంటూ వారు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని రాహుల్ గాంధీ కోరారు. ఉపసంహరించుకుంటాంపుణే కోర్టులో రాహుల్ గాంధీ తరఫున ఆయన లాయర్ మిలింద్ పవార్ పిటిషన్ వేసిన కొన్ని గంటల్లోనే మరో ట్విస్టు చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఆమోదం లేకుండానే ఈ పిటిషన్ దాఖలు చేశానని సదరు లాయర్ పేర్కొన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకోసం గురువారం విజ్ఞాపన పత్రం సమర్పిస్తానన్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
పుణె: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కాగా, ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న హాజరుకావాలని కోరుతూ రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. సత్య సావర్కర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 500 ప్రకారం రాహుల్ సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.ఇదీ చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరికి జీవితఖైదు
పుణె: అంధవిశ్వాసాలను రూపుమాపేందుకు మహారాష్ట్రలో సామాజిక ఉద్యమం చేసిన హేతువాది డాక్టర్ నరేంద్ర దభోల్కర్ హత్యోదంతంలో ఇద్దరు నిందితులకు పుణె ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. దభోల్కర్ హత్య జరిగిన 11 సంవత్సరాలకు తీర్పు వెలువడటం గమనార్హం. ఈ కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ హత్యలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీరేంద్రసిన్హా తావ్డేకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటిస్తూ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. షూటర్లు సచిన్ అంధూరే, శరద్ కలాస్కర్లకు జీవితఖైదుతోపాటు చెరో రూ.5 లక్షల జరిమాన విధించారు. సరైన సాక్ష్యాలు లేని కారణంగా తావ్డే, సంజీవ్, విక్రమ్‌ను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. 67 ఏళ్ల దభోల్కర్ 2013 ఆగస్ట్ 20న పుణెలో ఉదయపు నడకకు వెళ్లినపుడు బైక్‌పై వచి్చన ఆగంతకులు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలైన దభోల్కర్ ఆస్పత్రిలో చనిపోయారు. -
ఉరి సరే.. బెయిల్ ఇవ్వండి
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ ఇండియన్ ముజాహిదీన్ కో–ఫౌండర్ యాసిన్ భత్కల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పుణేలో నమోదైన కేసులో తనకు బెయిల్ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళ కేసులో ఇతడికి ఉరిశిక్ష పడిన విషయం విదితమే. ఇదిలా ఉండగానే పుణేలో నమోదైన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ గత వారం తన న్యాయవాది ద్వారా అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. తనను న్యాయస్థానం ముందు హాజరుపరచడంతో పోలీసులు విఫలమయ్యారని, ఈ కారణంగానే తనకు బెయిల్ ఇవ్వాలని కోరాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్, బెంగళూరులతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, విధ్వంసాలకు సూత్రధారిగా ఉన్న గజ ఉగ్రవాది యాసీన్ భత్కల్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. ఇతడిపై ఉన్న కేసుల్లో 2010 ఫిబ్రవరి 13 నాటి పుణే జర్మన్ బేకరీలో పేలుడు కేసు ఒకటి. ఈ ఘాతుకంగా 17 మంది చనిపోగా... మరో 56 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ కేసులు పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేయగా విచారణ జరగాల్సి ఉంది. యాసీన్ సహా అతడి అనుచరులను 2015 నుంచి రాష్ట్రంలోనే ఉంచేశారు. ఇక్కడి కేసుల విచారణ పూర్తయ్యే వరకు మరో చోటికి తరలించకుండా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2013 ఫిబ్రవరి నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఈ ఉగ్రవాదుల్ని మరో ప్రాంతానికి తరలించడానికి కుదరలేదు. ఈ కేసుల విచారణ గత ఏడాది ముగిసి ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడింది. ఆపై వీరిని ఢిల్లీకి తరలించిన అధికారులు అక్కడి తీహార్ జైలులో ఉంచారు. క్కడ నుంచే వివిధ రాష్ట్రాల్లో ఉన్న కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2013 నుంచి ఇప్పటి వరకు యాసీన్‌ను పుణే కోర్టులో 71 సార్లు హాజరుపరచాల్సి ఉండగా అది సాధ్యం కాలేదు. ఇన్ని పర్యాయాలు వారి వాయిదాలు కోరడంతో ఆ కేసులో అభియోగపత్రాలు దాఖలైనప్పటికీ విచారణ ప్రారంభంకాలేదు. ట్రయల్ నిర్వహించాలంటే కచ్చితంగా నిందుతులు కోర్టులో హాజరుకావాల్సి ఉండటంతో ఇలా జరిగింది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన యాసీన్ గత వారం తన న్యాయవాది జహీర్ పఠాన్ ద్వారా బెయిల్ పిటిషన్ వేయించారు. తనను కోర్టు ముందు హాజరుపచడంలో పుణే పోలీసులు విఫలమవుతున్నారని, ఈ నేపథ్యంలోనే తనకు ఆ కేసులో బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన అక్కడి ప్రత్యేక న్యాయస్థానం పూర్వాపరాలు పరిశీలించింది. నిందితుడిని హాజరు పరచలేకపోవడం వెనుక పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం లేదని తేలింది. ఫలితంగా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్ పేలుళ్ళలో ఉరి శిక్షపడిన, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న యాసీన్‌కు పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసినా బయటకు రావడం సాధ్యంకాదు. అయినప్పటికీ ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనుక మర్మం ఏమిటన్నది నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కేవలం ప్రజల దృష్టి తన వైపు తిప్పుకోవడానికేనా? లేక మరోదైనా కారణం ఉందా? అనే అంశాలను కూపీలాగుతున్నాయి. -
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఖైదీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన కుమ్మరి సత్యం అలియాస్ చిన్న సత్యంకు ఓ హత్య కేసులో పూనె కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతనికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. ఈ క్రమంలో అతను బాత్రూంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గత నెల 29న కూడా ఇతనికి ఇక్కడ చికిత్స చేయించారు. కాగా, గత ఏడాది మార్చి 9న మహారాష్ట్ర కోర్టు ఇతనికి జీవిత ఖైదు విధించింది. -
సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌పై వచ్చిన కేసును విచారించేందుకు పుణెలోని బారామతిలో గల ఓ కోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలోని ధన్‌గార్ (పశువుల కాపర్లు) వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఇస్తామంటూ ఆయన ఎన్నికల సమయంలో తప్పుడు హామీ ఇచ్చారని హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఈ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం మోసగించినది ఏమీ లేదంటూ జడ్జి.. ఈ కేసు విచారణకు నిరాకరించారు. -
మానేకు మరణ శిక్షే!
పింప్రి, న్యూస్‌లైన్: పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి 9 మంది మృతికి, 35 మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ సంతోష్ మానేకు పుణే కోర్టు బుధవారం ఉరిశిక్షను విధించింది. వివరాల్లోకెళ్తే... గత సంవత్సరం జనవరి 25న షోలాపూర్ జిల్లా, కారాలేకు చెందిన సంతోష్ మానే... పై అధికారి సెలవు ఇవ్వలేదనే కోపంతో ఉన్మాదిలా మారి పుణేలోని స్వార్గేట్ బస్ డీపోనుంచి బస్సును బయటకు తీసి రోడ్డుకు వ్యతిరేక దిశలో నడిపాడు. ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొడుతూ దూసుకుపోయాడు. ఈ ఘటనలో 9 మంది మరణించగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. 40కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మానేను వెంబడించిన పోలీసులు చివరికి అతణ్ని పట్టుకొని, కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. కేసును విచారించిన పుణే న్యాయస్థానం మానేకు ఉరిశిక్ష విధించింది. దీంతో కోర్టు తీర్పును సవాలు చేస్తూ మానే బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. మానే తరఫు న్యాయవాది జయదీప్ మానే... సంతోష్ మానేకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా కోర్టును కోరారు. కాగా బాంబే హైకోర్టు శిక్షను రద్దు చేసి, ఈ కేసును పునఃపరిశీలించాలని, అతని మానసిక స్థితిని కూడా పరిశీలించాలని పుణే కోర్టుకు సూచించింది. దీంతో యెర్వాడ మానసిక ఆస్పత్రిలో నలుగురు డాక్టర్ల బృందం సంతోష్ మానేకు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన నివేదిక అనంతరం ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన వాదోపవాదాలు జరిగాయి. వాదనలు పూర్తి కావడంతో పుణే కోర్టు 11వ తేదీన తుది తీర్పునిచ్చింది. పునర్విచారణ తర్వాత కూడా మానేకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు పుణే న్యాయమూర్తి వీకే శవలే తీర్పునిచ్చారు.


