
నాపై ఫిర్యాదు చేసింది గాడ్సే కుటుంబ సభ్యుడే
ఓట్ల చోరీని బయటపెట్టినందుకు ఇద్దరు బీజేపీ నేతలు బెదిరించారు
నాకు తగిన భద్రత కల్పించండి పుణే కోర్టుకు కాంగ్రెస్ నేత
రాహుల్ గాంధీ విజ్ఞాపన
న్యూఢిల్లీ: హిందూ జాతీయవాది వినాయక్ దామోదర్ సావర్కార్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. సావర్కర్ పరువుకు నష్టం వాటిల్లిందంటూ తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే కుటుంబ సభ్యుడేనని తెలియజేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే బంధువు తనపై ఫిర్యాదు చేయడం చూస్తే తనకు ప్రాణాపాయం ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ బుధవారం పుణే కోర్టుకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. సావర్కర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు ఇటీవల తాను లేవనెత్తిన రాజకీయ అంశాల దృష్ట్యా తన భద్రత ప్రమాదంలో పడినట్లు భావిస్తున్నానని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కుటుంబం గతంలో హింసాకాండకు పాల్పడినట్లు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు దిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. ఆ చరిత్ర మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు.
మహత్మా గాంధీ హత్య లాంటిది మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఓట్ల చోరీ బాగోతాన్ని బయటపెట్టినందుకు ఇద్దరు బీజేపీ నాయకుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని రాహల్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ, తర్వీందర్‌సింగ్ మార్వా తనను బహిరంగంగా బెదిరించారని చెప్పారు. ‘దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ’ అంటూ వారు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని రాహుల్ గాంధీ కోరారు.
ఉపసంహరించుకుంటాంపుణే కోర్టులో రాహుల్ గాంధీ తరఫున ఆయన లాయర్ మిలింద్ పవార్ పిటిషన్ వేసిన కొన్ని గంటల్లోనే మరో ట్విస్టు చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఆమోదం లేకుండానే ఈ పిటిషన్ దాఖలు చేశానని సదరు లాయర్ పేర్కొన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకోసం గురువారం విజ్ఞాపన పత్రం సమర్పిస్తానన్నారు.