నినదిస్తున్న నేహా బోరా, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్, కార్యకర్తలు
150 మంది అరెస్ట్
కొనసాగిన ‘జ్ఞానేశ్ రాజీనామా’ఉద్యమం
న్యూఢిల్లీ: ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే కారణంగా అన్యాయంగా కోట్లాది మంది ఓటర్లు ఓటుహక్కు కోల్పోడానికి కారణమైన ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్ సీఈసీ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ) సభ్యులు సహా పలు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు మళ్లీ ఢిల్లీలో నిరసన మొదలెట్టారు.
పెద్దసంఖ్యలో ఉద్యమకారులను తాత్కాలికంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుసటిరోజే మళ్లీ పెద్దసంఖ్యలో నిరసనకారులు జంతర్‌మంతర్ దిశగా వచ్చారు. శనివారం పటేల్ చౌక్ నుంచి జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్తున్న వారిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాలో సీనియర్ లాయర్లు నిత్యా రామకృష్ణన్, పల్లవ్ సిసోడియా తదితరులు సైతం పాల్గొన్నారు. నేహా బోరాను ఒక పోలీస్ అధికారి కొట్టాడని, మరో ఢిల్లీ పోలీస్ అధికారి దూషించాడని ఏఐఎస్‌ఏ సభ్యులు ఆరోపించారు.
దీనిపై ఢిల్లీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు శుక్రవారం నాటి అనుమతిలేని ధర్నాలు, ర్యాలీలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు శనివారం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చిన సంస్థల పేర్లను అందులో చేర్చారు. జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నాలకు ఆస్కారంలేకుండా ఢిల్లీ పోలీసులు భారీస్థాయిలో బలగాలను మొహరిస్తున్నారు.


