
శుక్రవారం ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
మర్చిపోలేని గుణపాఠం తప్పదు
పాక్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక
అణు బెదిరింపులు ఇక చెల్లవు
పాక్ ఆర్మీ చీఫ్‌కు చురకలు
‘సిందూర్’తో దాయాదికి నిద్రలేని రాత్రులు
ఉగ్ర పోషకులూ ఇకపై ఉగ్రవాదులే
ఇదే నయా భారత నవమంత్రం
ఎర్రకోట సాక్షిగా మోదీ స్పష్టీకరణ
సుదీర్ఘంగా 103 నిమిషాల ప్రసంగం
భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తెస్తున్నాంఈ దీపావళికి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తాం
యువత కోసం రూ. లక్ష కోట్లతో కొత్త పథకం తెస్తాం
ప్రైవేటు రంగంలో ఉపాధి పొందే యువతకు
రూ. 15 వేలు.. 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి
శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మిషన్ సుదర్శన చక్ర.. 2035కి శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటు
ప్రతి ఒక్కరమూ భారత్‌లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్‌లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా.
..: మోదీ :..
న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి.
ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు.
‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు.
ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్‌కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు.
సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.
బలగాలు సత్తా చాటాయి
‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.
శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర
దేశ భద్రతకు ఛత్రం
పదేళ్లలో అందుబాటులోకి
దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.
‘సింధూ’ ఇక భారత సొత్తే!
‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్‌లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.
అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర!
హై పవర్ మిషన్‌తో అడ్డుకట్ట
అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్‌కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు.
నారీ శక్తికి సలాం
‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్‌లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్‌పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.
స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి
యువతకు మోదీ సవాలు
వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్‌కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం.
శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్‌లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి.
ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్‌కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు.
తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్‌కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్‌యాన్‌కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు.
అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్‌ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్.
కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.
తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా
‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’.
యువత కోసం... రూ.లక్ష కోట్లు
‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్‌మంత్రీ వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’.
కీలక ఖనిజాలపై దృష్టి
‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం.
ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్‌కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.
పదింతలకు ‘అణు’ పాటవం
‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’.