
విశ్వబంధువైన భారత్‌కు విరోధులు లేరు
ఇతర దేశాలపై ఆధారపడటమే మనకున్న అతిపెద్ద అడ్డంకి
హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందన
ఆత్మనిర్భరతే అసలైన పరిష్కారమని హితబోధ
భావ్‌నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు. శనివారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి తర్వాత ‘సముద్రం నుంచి సమృద్ధిదాకా’కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘విశ్వబంధు భావనతో భారత్ దూసుకుపోతోంది.
అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరా«దీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుంది. విశ్వశాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పాటుపడే దేశం కచి్చతంగా స్వయంసమృద్ధిని సాధించాలి. స్వావలంబన సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడితే జాతీయ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది’’అని మోదీ అన్నారు.
140 కోట్ల ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టబోం
‘‘140 కోట్ల ప్రజల భవిష్యత్తును విదేశీ శక్తుల చేతుల్లో పెట్టబోం. విదేశీ పరా«దీనత అనేది మన జాతీయాభివృద్ధిని నిర్దేశిస్తుందంటే అస్సలు అంగీకరించబోం. మన భావితరాల భవిష్యత్తును ఇతరుల చేతికి అందించబోం. ఏకంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇతర దేశాలపై ఆధారపడితే జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. ఒక సామెతలాగా చెప్పాలంటే 100 సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు.. భారత్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అదే ఆత్మనిర్భరత’’అని మోదీ ఉద్ఘాటించారు.
కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల నిప్పులు
పనిలోపనిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీలపై, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత్‌లో నిగూఢంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నాలు స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలదాకా జరగనేలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచిపోషించిన లైసెన్స్‌రాజ్ వ్యవస్థలో దేశాభివృద్ధి పడకేసింది. లైసెన్స్–కోటా రాజ్యంలో భారత్ విశ్వవిపణిలోకి అడుగుపెట్టలేక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణ శకం మొదలైనప్పుడు గత ప్రభుత్వాలు తప్పిదాలే చేశాయి.
దేశావసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించాల్సిందిపోయి కేవలం దిగుమతులపైనే దృష్టిపెట్టాయి. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. తప్పుడు విధానపర నిర్ణయాల కారణంగా ప్రభ కోల్పోయిన రంగాల్లో నౌకల తయారీ పరిశ్రమ కీలకమైంది. గతంలో భారతీయ తయారీ నౌకలనే మనం ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు విదేశాలపై ఆధారపడుతున్నాం. అప్పట్లో ఎగుమతిదిగుమతి సరుకుల్లో 40 శాతం భారతీయ నౌకల్లో జరిగేవి.
ఇప్పుడు కేవలం 5 శాతం నౌకల్లో జరుగుతోంది. మిగతావన్నీ విదేశీ నౌకలే. అందుకే ఏటా ఏకంగా రూ.6 లక్షల కోట్లను వినియోగ ఖర్చుల కింద విదేశీ నౌకల కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడు దశాబ్దాల్లో ఎంత చెల్లించామో లెక్కేసుకోండి. ఇంత సొమ్ము విదేశాలకు వెళ్లడంతో ఆయా దేశాల్లో ఉపాధి పెరిగింది. ఇదే సొమ్ములో కొంత అయినా దేశీయంగా పెట్టుబడిగా మార్చి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగేవో ఊహించుకోండి. దేశీయ నౌకలనే వినియోగించి ఉంటే ఏటా భారత్ లక్షల కోట్ల ఆదాయాన్ని చవిచూసేది’’అని మోదీ వివరించారు.
షిప్ అయినా చిప్ అయినా ఇక్కడిదై ఉండాలి
చిప్(సెమీకండక్టర్) కావొచ్చు షిప్ కావొచ్చు. ఏదైనా భారత్‌లోనే తయారుకావాలి. వాటిని మనమే తయారుచేద్దాం. సముద్రవిపణిలో అగ్రగామిగా మారితే అంతర్జాతీయంగా పరపతి ఇనుమడిస్తుంది. ఇందుకు దేశీయనౌకాశ్రయాలే వెన్నుముక. దేశీయ సముద్రనౌకారంగం నవతరం సంస్కరణల దిశగా దూసుకుపోతోంది. పలు రకాల డాక్యుమెంట్లు, పత్రాల సమర్పణ, తనిఖీ వంటి సుదీర్ఘ ప్రక్రియకు దేశంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో చెల్లుచీటీ రాసేశాం. దీంతో ఒకే దేశం–ఒకే డాక్యుమెంట్, ఒకే దేశం–ఒకే నౌకాశ్రయం విధానంలో వాణిజ్యం, వ్యాపారం సులభతరమవుతుంది’’అని అన్నారు.
రుణాలు ఇక సులువు
‘‘నౌకల తయారీ సంస్థలకు ఇప్పుడు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్‌ల నుంచి రుణాలను పొందగల్గుతున్నాయి. మౌలికవసతుల ఫైనాన్సింగ్ సదుపాయం ఇప్పుడు అన్ని నౌకలతయారీ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. మరో మూడు కీలక పథకాలపై ఎన్‌డీఏ సర్కార్ దృష్టిసారించింది. భారత్‌ను సముద్రయాన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రుణలభ్యతతో నూతన సాంకేతికత, ఆధునిక డిజైన్, అత్యున్నత ప్రమాణాలను సంస్థలు అందిపుచ్చుకుంటాయి. త్వరలో ఈ రంగంలో ప్రభుత్వం రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’’అని మోదీ అన్నారు.
కార్యక్రమాల్లో భాగంగా రూ.7,870 కోట్ల విలువైన సముద్రయానసంబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికితోడు గుజరాత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రూ.26,354 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామికప్రాంతమైన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్‌లో హెలికాప్టర్‌లో విహంగవీక్షణం చేశారు. అహ్మదాబాద్‌లోని లోథల్‌లో భారతీయ సముద్రయాన వారసత్వాన్ని చాటే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణపనులనూ మోదీ పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన భావ్‌నగర్‌కు చేరుకోగానే రోడ్‌షోలో పాల్గొన్నారు.